అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రూ. 5 లక్షల విరాళం అందించింది ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబం. అలాగే కరోనా మహమ్మారి కట్టడికి మరో రూ. 5 లక్షలు విరాళం ఇచ్చింది. రామాలయానికి భూమిపూజ నిర్వహించటాన్ని స్వాగతించారు వెంకయ్య. ఆలయ నిర్మాణం కాలాతీతమైన మానవ విలువలకు నివాళిగా నిలుస్తుందన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం మతపరమైన వ్యవహారం కంటే చాలా ఎక్కువని పేర్కొన్నారు.
శ్రీరాముడి ప్రవర్తన, విలువలు భారత దేశ చైతన్యంలో ప్రధానమైనవి. అన్ని రకాల విభజనలు, అడ్డంకులను తొలిగించాయి. అవి నేటికీ ఆచరణలో ఉన్నాయి. మర్యాద పురుషోత్తముడి జీవితంలోని సత్యం, నైతికత, ఆదర్శాలు, అత్యున్నత మానవ విలువలకు తిరిగి పట్టాభిషేకం జరిగింది. అయోధ్య రాజుగా.. ఆయన సామాన్యులు, ఇతర ప్రభువులకు తగినవిధంగా ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా ఉపరాష్ట్రపతి అధికారిక నివాసంలో వెంకయ్య, ఆయన భార్య ఉషా రామాయణాన్ని పఠించారు.