నిత్యం పేదలను ఆదుకునే రాష్ట్ర సర్కారు ఉండగా– ఎన్నారైలే ఏపీని కాపాడాలంటావు, ఎందుకు బాబూ! మతి భ్రమించిందా ? అంటూ చంద్రబాబు నాయుడిపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ‘ఆంధ్రప్రదేశ్ పేదలను విదేశాల్లో స్థిరపడిన తెలుగు ఎన్నారైలు, రాష్ట్రంలోని ధనికులే కాపాడాలి’ అని కొత్త ఏడాది తొలిరోజు టీడీపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరులో పిలుపునివ్వడం ఆంధ్రులందరికీ తలవంపులు తెచ్చేలా ఉందన్నారు.
తన పాలనలో పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలను గాలికి వదిలేసి తన కలల రాజధాని అమరావతి చుట్టూ ప్రదిక్షణలు చేశారు నారా వారు. ఆయన ఏలుబడిలో పేదలు నానా కష్టాలు పడ్డారు. ఆర్థికంగా, పాలనాపరంగా ఆదుకునే వ్యవస్థలు లేక చెప్పలేనన్ని యాతనలు అనుభవించారు ఆంధ్ర ప్రజలు. గత మూడున్నరేళ్లుగా పేదలు, ఇతర బడుగువర్గాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లెక్కలేనన్ని పథకాలతో ఆదుకుంటోంది. ప్రతి సందర్భంలోనూ నేనున్నానంటూ బలహీనులకు ఆసరాగా నిలుస్తోందని ఆగ్రహించారు.
ఒక వేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిస్తే పేద ప్రజానీకాన్ని ఇంకా మరింత మెరుగైన రీతిలో ఎలా బాగుచేస్తానో చంద్రబాబు చెప్పడం లేదు. ఆయనలో ఆ నమ్మకం కూడా కనిపించడం లేదు. 2023లో పేద ప్రజలు పైకి రావాలంటే ఎన్నారైలు, ఇక్కడి ధనికులు కలిసి సాయం చేయాలని 14 ఏళ్ల అనుభవం ఉన్న 72 సంవత్సరాల సీనియర్ నేత చంద్రబాబు అర్థించడం హేతుబద్ధంగా కనిపించడం లేదు. రాష్ట్రంలోని సహజ వనరులు, పెట్టుబడులు, కేంద్ర ప్రభుత్వం అందించే నిధులు, పన్నులు, సుంకాల ద్వారా వచ్చే ఆదాయంతో ఏపీ సర్వతోముఖాభివృద్ధికి, సర్కారు సహకారం అవసరమున్న ప్రజల పురోగతికి కృషిచేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగా ఎన్నారైలు ఇక్కడకొచ్చి పేదలను ఆదుకోవాలని ఆయన కోరడం లాజిక్కుకు అందని విషయమన్నారు.