ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ కొనసాగింపే మంచిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సమర్ధించారు. కరోనాతో జరిగే ఆర్థిక నష్టం నుంచి మనం కోలుకోగలం కానీ పోయిన ప్రాణాలను వెనక్కి తీసుకుని రాలేమని.. అందుకే లాక్‌డౌన్ పొడగించాలని ప్రధాని నరేంద్ర మోదీని చెప్పానని కేసీఆర్ తెలిపారు. ఈ క్రమంలో కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. విజయశాంతి ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు.
లాక్‌డౌన్‌కు విరామం ఇవ్వొద్దని.. ఇంకా కొద్ది రోజులపాటు కొనసాగించాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా సంక్షేమ దృష్ట్యా సంపూర్ణంగా సమర్థిస్తున్నట్టు విజయశాంతి చెప్పారు. మరోవైపు ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. దానిపై ప్రజల్లో అవగాహన కలిగించేలా ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రజలకు, అభిమానులకు పలు సూచనలు చేస్తున్నారు.
కొన్నేళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయశాంతి.. ఇటీవల మరోసారి వెండితెరపై మెరిసిన సంగతి తెలిసిందే. మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ప్రొఫెసర్ భారతి పాత్రలో విజయశాంతి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే తాను ప్రస్తుతానికి ఈ ఒక్క చిత్రమే చేశానని.. ఇప్పటికైతే ఇక సినిమాలకు సెలవు అని ఆమె ప్రకటించారు.