కరోనాను కట్టడి చేయడానికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపధ్యంలో లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం లో భాగంగా అన్ని దేశాలు కూడా ఇప్పుడు బలవంతంగా అయినా సరే కర్ఫ్యూ ని అమలు చెయ్యాలని ఒక నిర్ణయానికి వచ్చాయి. వైరస్ మరింత విస్తరించే అవకాశం ఉన్న నేపధ్యంలోనే ఆదిలోనే అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నాయి.
తెలంగాణా ప్రభుత్వం ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ని ప్రకటించింది. ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నిర్ణయం ప్రకటించారు. ప్రజారవాణా కూడా అందుబాటులో ఉండదని.. బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు ఏవీ నడవబోవని ప్రకటించారు. అంతేకాదు అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తామని కేసీఆర్ స్పష్టం చేసారు. దీనికి తెలంగాణా కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి మద్దతు పలికారు.
“ప్రపంచంతో పాటు, మన దేశాన్ని కుదిపేస్తున్న కరోనాను నియంత్రించడానికి ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణలో లాకౌట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయాలకతీతంగా సమర్ధించాల్సిన అవసరం ఉందని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. కాగా తెలంగాణా బాటలోనే ఆంధ్రప్రదేశ్ కూడా లాక్ డౌన్ ప్రకటించింది.