చిన్నచిన్న కాగితాలు తీసుకుని బయటకు వచ్చేసి ఏవో కారణాలు చెబుతున్నారు. అసలు బయటకు ఎందుకు రావాలి? ప్రజలకు సామాజిక బాధ్యత లేదా? పోలీసులకు మాత్రమే బాధ్యత ఉండాలనుకుంటున్నారా? అన్ని శాఖలకు ప్రజలు సహకరించాలి! అధికార యంత్రాంగంతో సహకరిస్తే సరేసరి! లేకపోతే మా పద్ధతుల్లో మేం వెళ్తాం! రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఎవరు గడప దాటి బయటకు వచ్చినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం! అని సీరియస్ గా వార్నింగ్స్ ఇస్తున్నారు విజయవాడ పోలీసులు. ఒకరు ఇద్దరు చేస్తున్న చిల్లర పనులవల్ల పదుల సంఖ్యలో కరోనా బాదితులు పుట్టుకొస్తున్న తరుణంలో పోలీసులు… ఇకపైఇ మరింత స్ట్రిక్ట్ గా ఉండటానికే ఫిక్సయినట్లున్నారు!
అవును… పోలీసులు చెప్పేలా చెబితేనా కానీ జనాల బుర్రలకు ఎక్కదనుకున్నారో ఏమో కానీ… ఒక రేంజ్ లో వార్నింగ్స్ ఇస్తున్నారు విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు! తాజాగా కలెక్టర్ ఇంతియాజ్, సీపీ ద్వారకా తిరుమలరావు కృష్ణలంక హాట్ స్పాట్ లో పర్యటించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి లోపాలను అడిగి తెలుసుకున్నారు. 20 వాహనాలతో పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడిన కమిషనర్… కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఘాటుగా స్పందించారు.
నగరంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి… రోడ్లపైకి రావాల్సిన అవసరం లేకుండా అధికారులు చూసుకుంటున్నారు! అలా కాకుండా పాజిటివ్ కేసులు పెరిగేలా ప్రవర్తిస్తే మాత్రం… పోలీసు యాక్షన్ చాలా కఠినంగా ఉంటుందని, ఈ విషయంలో మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు కమిషనర్! అధికార యంత్రాంగంతో ప్రజలు సహకరిస్తే సరేసరి… అలా కానిపక్షంలో మా పద్ధతుల్లో మేం వెళ్తాం అని కాస్త ఘాటుగానే హెచ్చరించారు బెజవాడ కమిషనర్!
ఈ హెచ్చరికలతో అయినా జనాలకు కాస్తా బుద్ది రాకపోయినా కనీసం భయం అయినా వచ్చి… రోడ్లపై తిరగడం, రోగాలను దాచడం వంటివి చేయకుండా… అన్ని రకాలుగా అధికారులకు సహకరిస్తారని ఆశిద్దాం!