అసెంబ్లీ రద్దవుతుందని, రాష్ట్రపతి పాలన వస్తుందంటూ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వాక్యాలు అర్ధరహితమని టిఆర్ఎస్ నేత బి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఆయన తనకు తానుగా ఏదేదో ఊహించుకొని బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని అన్నారు.
శాసనసభను రద్దు చేసేది లేదంటూ ముఖ్యమంత్రే పలు సందర్భాల్లో స్పష్టం చేశారని, అయినా దానిపై ప్రజలను గందరగోళ పరిచేలా ఉత్తమ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
కాగా, అంతకు ముందు… ఈ నెలలో రాష్ట్ర అసెంబ్లీ రద్దు కాబోతుందంటూ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుందన్నారు. తాను కోదాడ నుంచి 50 వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీలో ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు.