మాస్ డైరెక్టర్ వి. వి. వినాయక్ నటుడిగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ని నిర్మాతగా పరిచయం చేసిన కృతజ్ఞతతో ఇప్పుడు రాజుగారు వినాయక్ ని నటుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి నరసింహారావు దర్శకత్వం వహిస్తున్నారు. అతి త్వరలోనే సినిమా ప్రారంభించి రెగ్యులర్ షూట్ కి వెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు. అయితే ప్రారంభానికి ముందే వినాయక్ పెద్ద షాకే ఇచ్చాడు. వినాయక్ వయసు ఇప్పుడు 44. కానీ సినిమా కోసం గంటల తరబడి జిమ్ములో కసరత్తులు చేస్తున్నట్లు కొద్ది సేపటి క్రితమే ఫోటోలతో సహా లీకులిచ్చాడు. దీంతో ఈ సినిమా కథాంశం ఏంటో అర్ధంకానీ సన్నివేశం ఏర్పడింది.
వినాయక్ ని ఈ వయసులో హీరోగా చూపించడం అనేది అసాధ్యం. కాబట్టి స్టోరీ బేస్డ్ గానే వినాయక్ ని ఎలివేట్ చేసే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ ఇప్పుడాయన జిమ్ములో కసతర్తులు చేయడం చూస్తుంటే నిజంగా హీరోగానే ఎంట్రీ ఇస్తున్నాడా? అన్న డౌట్ రాక తప్పదు. ఎందుకంటే లీకైన ఫోటోల్లో వినాయక్ హీరోయిక్ లుక్ కు దగ్గరగా కనిపిస్తున్నాడు. బరువు తగ్గి స్లిమ్ అయ్యాడు. పొట్ట తగ్గింది. శరీరం టైట్ గా ఉంది. మొత్తంగా బాడీకి ఓ రూపాన్ని అందించాడు. దీంతో కథ విషయంలో క్లారిటీ లోపిస్తుంది. రాజుగారు సినిమా అనౌన్స్ చేయగానే ఏదో వినాయక్ మీద అభిమానంతో చేస్తున్నాడనుకున్నారు. కానీ వినాయక్ లో ఇంత సీరియస్ నెస్ ఉందని తెలియలేదు. మరి కథలో దమ్మెంతో చూడాలి.
వినాయక్ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అయినా అప్పుడప్పుడు తన యాక్టింగ్ ఆసక్తిని చూపించేవాడు. ఠాగూరు, ఖైదీ నంబర్ 150 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. ముఖ్యంగా ఠాగూరులో లంచగొండి తండ్రి కుమారుడి పాత్రలో బాగా నటించాడు. మా నాన్న అవినీతి పరుడు గానీ…నేను మాత్రం ఆ అవినీతి పరుడి కొడుకుని కాదని చిరంజీవితో తెరను పంచుకునే సన్నివేశం హైలైట్ గా నిలిచించి. ఆ సీన్ ను అప్పట్లో చిరంజీవి కూడా మెచ్చారు. మరి ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్ లో నటిస్తున్నాడు? ఎంత వరకూ ఆకట్టుకుంటాడో చూద్దాం. ప్రస్తుతం వినాయక్ కి దర్శకుడిగా అవకాశాలు తగ్గిన సంగతి తెలిసిందే.