మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో చిరు బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సుమ యాంకర్‌గా వ్యవహరిస్తున్న ‘సుమ అడ్డా’ షోకు చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లారు. షోలో సుమ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. ఇంతకీ సుమ చిరుని ఏం ప్రశ్నలు అడిగింది. వాటికి చిరంజీవి సమాధానాలేంటి..?
సుమ అడ్డాలో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఈషోలో చిరు.. అభిమానులతో కలిసి జాలీగా గడిపారు. సుమను ఆటపట్టించారు. తన సీక్రెట్లు షేర్ చేసుకున్నారు. అనంతరం షో యాంకర్ సుమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘చాలా రోజుల నుంచి నిన్ను చూస్తున్నాను.. నీ గ్రోత్‌ను గమనిస్తున్నాను. నీలాంటి వాళ్లు యాంకర్‌గా ఉన్న ఇలాంటి షోకు రావడం ఓ స్టేటస్‌గా ఫీల్ అవుతున్నాను’ అని సుమను ఆకాశానికెత్తేశారు.
ఈ క్రమంలో సుమ మెగాస్టార్‌ను ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ‘ మేము సినీ పరిశ్రమకు రావడానికి చిరంజీవి కారణమని చాలా మంది అంటారు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?’ అని అడిగారు. దీనికి మెగాస్టార్ సమాధానమిస్తూ.. ”యాక్టర్లు, డ్యాన్సర్లు, ఫైట్ మాస్టర్లు లాంటి చాలా మంది.. ‘మీ స్ఫూర్తితోనే సిమాల్లోకి వచ్చాం’ అంటుంటారు. అంలాటివి విన్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నా స్టార్ స్టేటస్, సినిమాల ద్వారా సంపాదించుకున్న ఇమేజ్ కన్నా ఇలాంటివే నాకు ఎనలేని సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తాయి. ఇది నాకు దొరికిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్న” అని సమాధానమిచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి సెల్ఫ్‌మేడ్ స్టార్ అని.. అయన ప్రతి సినిమా మొదటి మూవీలానే ప్రెజెంట్ చేస్తారని డైరెక్టర్ బాబీ అన్నారు. దీనిపై సుమ అడిగిన ప్రశ్నకు చిరంజీవి స్పందిస్తూ.. ‘అది ఏ సినిమా అయినా ఎంత నంబర్ అయినా.. నాకు మొదటి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ చేస్తున్నట్టే అనిపిస్తుంది. ప్రతి రోజు.. ఏ సన్నివేశం అయినా.. ఏ క్యారక్టర్ అయినా కొత్తగా చేయాలని పరితపిస్తుంటాను’ అని చెప్పారు.