చంద్రయాన్-2 కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇస్రో ఔత్సాహికులకు అవకాశం కల్పిస్తోంది. అందులో భాగంగా ఇస్రో అధికార వెబ్‌సైట్‌ను సందర్శించి వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం చంద్రయాన్-2 జూలై 15వ తేదీన జరగాల్సి ఉన్నా.. పలు సాంకేతిక సమస్యల వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీన చంద్రయాన్-2ను ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది. దీంతో ఆ తేదీన మధ్యాహ్నం 2.43 గంటలకు ఇస్రో చంద్రయాన్-2 ను ప్రయోగించనుంది. అయితే చంద్రయాన్-2 కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే ఔత్సాహికులకు ఇస్రో సదవకాశాన్ని కల్పిస్తోంది. అందుకు ఏం చేయాలంటే..
చంద్రయాన్-2 కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇస్రో ఔత్సాహికులకు అవకాశం కల్పిస్తోంది. అందులో భాగంగా ఇస్రో అధికార వెబ్‌సైట్‌ను సందర్శించి వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తరువాత వారికి ఇస్రోలో ఉన్న వీక్షకుల గ్యాలరీ నుంచి చంద్రయాన్-2 ప్రయోగాన్ని చూసేందుకు అనుమతినిస్తారు. అయితే ఈ విషయంలో ఎవరికైనా సందేహాలున్నట్లయితే +91-7382768500 నంబర్‌కు ఫోన్ కూడా చేయవచ్చని ఇస్రో తెలిపింది.
కాగా చంద్రయాన్-2 ప్రయోగానికి గాను ఆదివారం సాయంత్రం 6.43 గంటల నుంచి కౌంట్ డౌన్ నిర్వహిస్తారు. అనంతరం మరుసటి రోజు.. అంటే.. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు కౌంట్ డౌన్ ముగిసి జీఎస్ఎల్‌వీ మార్క్ 3 ఎం1 రాకెట్ చంద్రయాన్-2ను నింగిలోకి మోసుకెళ్తుంది. ఆ తరువాత చంద్రయాన్-2 నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రునిపై దిగుతుంది. అనంతరం దాన్నుంచి రోవర్ బయట పడి చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ అక్కడ ఉండే మట్టి, ఇతర నమూనాలను అది సేకరించి విశ్లేషిస్తుంది. ఆ వివరాలు మనకు చంద్రయాన్-2 ద్వారా అందుతాయి. మరి రెండోసారి చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమవుతుందా, లేదా చూడాలి..!