సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు విషయమై బీహార్ ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. అతని కేసును సీబీఐకి అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ కోరితే ఆ కేసును బీహార్ పోలీసులు సీబీఐకి అప్పగిస్తారని తెలిపింది. ఈ క్రమంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది.
అయితే ఇప్పటికే మహా సీఎం ఈ విషయమై స్పందించారు. సుశాంత్ కేసును ముంబై పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. దీన్ని బీహార్ వర్సెస్ మహారాష్ట్ర అంశంగా చూడొద్దన్నారు. కరోనాతో పోరాటంలో ఎంతో మంది ముంబై పోలీసులు చనిపోయారని, వారిని ఎగతాళి చేసేలా వ్యాఖ్యలు చేయొద్దన్నారు. సుశాంత్ కేసును ముంబై పోలీసులు బాగానే దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఇందులో సీబీఐ జోక్యం అవసరం లేదన్నారు.
కాగా సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును సీబీఐచే విచారణ జరిపించాలనే డిమాండ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీంతో మహారాష్ట్ర సర్కారుతోపాటు ముంబై పోలీసులు ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సుశాంత్ మృతి వెనుక బాలీవుడ్‌కు చెందిన పెద్దల హస్తం ఉందని, అందుకనే ముంబై పోలీసులు ఇప్పటి వరకు ఈ కేసు విషయంలో కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని, బాలీవుడ్ బిగ్‌షాట్స్‌ను కాపాడేందుకే ముంబై పోలీసులు యత్నిస్తున్నారని సుశాంత్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. పలు మీడియా సంస్థలు కూడా సుశాంత్ కేసులో అతని కుటుంబానికి అండగా నిలుస్తున్నాయి. ఆ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాయి.