2023 నవంబర్ 19 న అహ్మదాబాద్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ గురించి ఇప్పటికి ఎవ్వరు మర్చిపోలేరు.టోర్నీ మొదలైనప్పటి నుంచి అద్భుతంగా ఆడిన టీమ్ ఇండియా.. ఫైనల్స్ లో పేలవ ప్రదర్శనతో కంగారుల చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఓటమి గురించి రోహిత్ శర్మ స్పందించారు. వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఓటమి తర్వాత దేశ ప్రజలు మాపై కోపంతో ఉంటారనుకున్నామని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ‘ఫైనల్లో ఓటమి అనంతరం ప్రజలు నిరాశ పడి ఉంటారు. దీంతో మాపై కోపంగా ఉంటారని అనుకున్నాం. కానీ దేశంలో ఎక్కడికి వెళ్లినా మాపై ప్రేమ కురిపించారు అని,మా ఆట తీరును ప్రశంసించారు’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా, వరల్డ్ కప్ ఫైనల్ టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్కు దిగిన టీమిండియా 50 ఓవర్స్ లో 240 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం 241 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది .ఇది చూసిన భారత అభిమానులు ఇక గెలుపు నల్లేరు మీద నడకే అని అనుకున్నారు. కానీ ట్రావిస్ హెడ్ వీరవిహారం చేయడంతో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ సొంతం చేసుకుంది.