ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. సుమారు 20 మంది యాత్రికులు కేదార్ నాథ్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. వీరిలో ఏపీలోని విజయనగరం, తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం, భోజనం లేకపోవడంతో తెలుగు యాత్రికులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. వారంతా కుటుంబ సభ్యులకు కాల్ చేసి సాయం కోరినట్లు సమాచారం.
ఇక ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రికుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని తెలుగు యాత్రికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్ తక్షణమే స్పందించారు.‘కేదార్ నాథ్‌లో చిక్కుకున్న యాత్రికులను వారి స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఇందుకోసం స్పెషల్ టీములను ఏర్పాటు చేశాం.కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నాం.ఈలోగా వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సాయం కోరాం. యాత్రికులు, వారి ఫ్యామిలీ మెంబర్స్ ధైర్యంగా ఉండండి’ అని మంత్రి లోకేశ్ భరోసా కల్పించారు.