లోక్ సభ ఎన్నికలపై సీఈసీ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. జమ్మూకశ్మీర్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. జమ్ము కాశ్మీర్లో ఎన్నికల సన్నద్ధతపై అధికారులు, పార్టీలతో రాజివ్ కుమార్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ‘పారదర్శకంగా, వివక్ష లేకుండా నిర్వహిస్తామని తెలిపారు. అన్ని పార్టీల అభ్యర్థులకు భద్రత ఒకే విధంగా ఉండేలా చూస్తాం అని పేర్కొన్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్దే ఓటు వేయవచ్చు అని అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనాలి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎలక్టోరల్ బాండ్ల గురించి కూడా సీఈసీ ఈ సందర్భంగా వివరాలను వెల్లడించారు.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల డేటా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిందని ఆయన పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామని హామీ ఇచ్చారు.కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ లోపు జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాను సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.