రాష్ట్రంలోని రైతులకు ఎకరానికి రూ.7,500 చొప్పున రైతు బంధు నగదును త్వరలోనే అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి SLBC ప్రాంగణంలోని బత్తాయి మార్కెట్లో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెలాఖరు వరకు రూ. 2 లక్షలలోపు రైతులందరికీ రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. వచ్చే నెల నుంచి రూ. 2 లక్షలకు పైగా ఉన్న వారికి రుణమాఫీ ప్రక్రియ అమలవుతుందని వెల్లడతించారు.
వరి, పత్తి రైతులకు ఇబ్బంది లేకుండా మద్దతు ధర మేరకు పంటను కొనుగోలు చేస్తామన్నారు. ఈ మేరకు అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. తేమ పేరుతో రైతులను అధికారులు ఇబ్బందులు పెట్టవద్దని, రైతులు కూడా తేమ శాతం మేరకు ధాన్యం, పత్తి దిగుబడులు ఉండేలా చూసుకుని మార్కెట్‌కు తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వమని, రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.