ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ వార్తలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. విపరీతంగా ఫేక్ వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో మరొక వార్త తెగ ప్రచారమవుతోంది. సిటీల్లో నివాసం ఉండేవారు 15 కిలోమీటర్ల పరిధిలో ద్విచక్రవాహనాలపై వెళ్లేటప్పుడు హెల్మెట్లను ధరించాల్సిన పనిలేదని.. సదరు ఫేక్ వార్త ప్రచారం అవుతోంది.
సిటీ లిమిట్స్‌లో ద్విచక్ర వాహనం నడిపేవారు 15 కిలోమీటర్ల పరిధిలో వెళ్తే హెల్మెట్లను ధరించాల్సిన అవసరం లేదని ఆ మెసేజ్‌లో ఉంది. అలాగే కేవలం జాతీయ రహదారులపై వెళ్లేవారు మాత్రమే హెల్మెట్లను ధరించాలని, సాగర్ కుమార్ జైన్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా అందులో ఉంది. అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా.. ఎక్కడైనా సరే హెల్మెట్‌ను ధరించాలని తేల్చి చెప్పింది. సదరు వార్త ఫేక్ అని తేల్చింది.
2019 మోటార్ వెహికిల్స్ అమెండ్‌మెంట్ యాక్ట్ ప్రకారం.. ద్విచక్ర వాహనాలను నడిపేవారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. లేదంటే రూ.1వేయి వరకు జరిమానా విధిస్తారు. అదే మద్యం సేవించి వాహనాన్ని నడిపితే రూ.10వేల జరిమానా, జైలు శిక్ష.. లేదా కొన్ని సందర్భాల్లో రెండూ విధిస్తారు. అందువల్ల అలాంటి మెసేజ్‌లను నమ్మకూడదని, సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్‌లను నమ్మే ముందు ఒకసారి వెరిఫై చేసుకోవాలని పీఐబీ సూచించింది.