మనిషి చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది ? నిజానికి ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు. ఎందుకంటే చనిపోయిన ఎవరూ బతికి వచ్చి తమకు చనిపోయాక ఇలా జరిగిందని ఎక్కడా చెప్పలేదు కదా. కనుక ఎవరైనా సరే.. చనిపోయాక ఏం జరుగుతుందనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఎవరూ చెప్పలేదు. సైన్స్‌కే ఈ విషయం ఇప్పటికీ అంతుబట్టలేదు. కానీ ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పిన ప్రకారం మనిషి చనిపోయాక అతని ఆత్మ శరీరం నుంచి విడిపోతుందని, తరువాత ఆ ఆత్మ కొత్త శరీరంలోకి చేరుతుందని, ఇలా మనిషి పునర్జన్మ ప్రారంభమవుతుందని ఉంది. కానీ దానికి కూడా శాస్త్రీయంగా ఆధారాలు, రుజువులు లేవు. అయితే ఈ విషయం నిజమేనని ఓ వ్యక్తి చెప్పాడు.
సిరియాకు చెందిన హజీమ్ అనే ఓ వ్యక్తి నియర్ డెత్ ఎక్స్‌పీరియెన్స్ పొందాడు. చావుకు సమీపంగా వెళ్లి వచ్చాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు అతను నియర్ డెత్ ఎక్స్‌పీరియెన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎన్‌డీఈఆర్ఎఫ్) అనే ఓ వెబ్‌సైట్‌లో ఈ వివరాలను వెల్లడించాడు. చనిపోయిన తరువాత ఏం జరుగుతందనే విషయాన్ని అతను స్వయంగా తెలియజేశాడు. ఆ వివరాలు అతని మాటల్లోనే…
”నేను చనిపోయాక మరో కాస్మిక్ లోకంలోకి వెళ్లాను. ఆ ప్రదేశం అంతా ఖాళీగా ఉంది. అక్కడక్కడా పింక్ రంగులో మబ్బులు ఉన్నాయి. కొన్ని చోట్ల భారీ సైజు ఉన్న లోహపు వృత్తాలు ఉన్నాయి. అవి ఆకాశంలో పైన తిరుగుతున్నాయి. ఇద్దరు ఆధ్యాత్మిక వ్యక్తులు టెలిపతి ద్వారా సంభాషించుకుంటున్నారు. అందులో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి కమాండ్ ఇచ్చాడు. ఇతని జ్ఞాపకాలను పూర్తిగా చెరిపి వేసి మరొక కొత్త శరీరంలో ఇతన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధం చెయ్యి.. అన్నాడు. సరిగ్గా మనిషి పునర్జన్మ ఇలాగే మొదలవుతుందని అనుకున్నా. కానీ నన్ను అక్కడే తిరుగుతున్న లోహపు వృత్తంలో ఉంచారు. దాంతో నేనూ తిరగడం మొదలు పెట్టా. సడెన్‌గా నా జ్ఞాపకాలు అన్నీ చెరిగిపోసాగాయి. అయితే ఏదో గుర్తు తెలియని గొంతు అప్పుడే వినబడింది. ఇతను ఇప్పుడే చనిపోకూడదు. భూమిపై చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి. అందువల్ల అతను వెనక్కి వెళ్లాలి.. అని వినబడింది. దీంతో కొన్ని క్షణాల తరువాత నేను బతికి కళ్లు తెరిచా. అదంతా నాకు ఒక కలలా అనిపించింది..” అని హజీమ్ తెలిపాడు.
అయితే ఇదే విషయంపై శామ్ పార్నియా అనే నియర్ డెత్ ఎక్స్‌పీరియెన్స్ ఎక్స్‌పర్ట్ మాట్లాడుతూ.. మరణం అనేది బ్లాక్ అండ్ వైట్ మూమెంట్ కాదని, అదొక ప్రాసెస్ అని అన్నారు. నియర్ డెత్ ఎక్స్‌పీరియెన్స్ అయిన వారికి కనిపించేవన్నీ ఊహలు, కలలు మాత్రమేనని, అంత మాత్రం చేత చనిపోయాక హజీమ్ చెప్పినట్లే జరుగుతుందని గ్యారంటీ ఏమీ లేదని అన్నారు. మనిషి మెదడు పనిచేయడం లేదంటే అతను చనిపోయాడని అర్థమని అన్నారు. అంతమాత్రం చేత నియర్ డెత్ ఎక్స్‌పీరియెన్స్‌లో కనిపించేవన్నీ చనిపోయాక జరిగేవేనని నమ్మకూడదని అన్నారు.