దక్షిణాదిన బీజేపీకి ఎదిగే సీన్ అసలు కనిపించడంలేదు. కర్నాటకలో అధికారంలోకి వచ్చినా కూడా అక్కడ కుంపట్లు బీజేపీ హై కమాండే పెంచి పోషిస్తోంది. బలమైన సామాజికవర్గానికి చెందిన యడ్యూరప్పను దించేయడానికి అధిష్టానం అండదండలతో బీజేపీ నేతలు గట్టిగానే అన్నీ చేస్తున్నారు. ఇక యడ్డీ తరువాత బీజేపీని కర్నాటకలో కాపాడడం కష్టమే అని తేలుతున్న సత్యం. మరో వైపు చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే తెలంగాణాలో కాస్తో కూస్తో బలం ఉంది అనుకున్న చోట కూడా బీజేపీ ఇపుడు ఇబ్బందులలో ఉంది. ఇలా వచ్చాడు అని తీసుకోవడం తప్ప ఈటల రాజేందర్ ( Etela Rajender ) మీద జనాల్లో ఉన్న వ్యతిరేకతను అసలు గమనించలేకపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆయన మాజీ మంత్రిగా బీజేపీలోకి వచ్చారని, ఆయనకు బీజేపీ రక్షణ తప్ప బీజేపీకి ఆయన ఎంతవరకూ ప్లస్ అన్నది కూడా కమలనాధులు ఆలోచించలేదని తెలుస్తోంది. ఇపుడు ఈటల గెలుపు అన్నది బీజేపీకి కూడా ప్రెస్టేజ్ అయిపోయింది. నిజానికి హుజురాబాద్ ఉప ఎన్నికల తరువాత ఈటల రాజేందర్ సత్తా ఎంతో చూసి బీజేపీలోకి తీసుకుంటే కథ వేరేగా ఉండేదని, కానీ ఆదరాబాదరాగా బీజేపీ ఆయన్ని చంకనెత్తుకుందని అంటున్నారు. దాంతో ఇద్దరూ వ్యూహాత్మకంగా పప్పులో కాలు వేశారు అంటున్నారు. ఈటల బీజేపీ లో చేరకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉంటే ఎంతో కొంత మెరుగ్గా ఉండేది అన్న భావన కూడా ఉంది.
మరో వైపు చూస్తే ఈటల బీజేపీలో చేరడంతో ఆయన క్రెడిబిలిటీ డౌట్ లో పడింది. ఇక ఈటెల ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నా హుజురాబాద్‌కి ఏం చేయలేదు అన్న జనాల అసంతృప్తి కూడా బీజేపీ కొంప ముంచేలా ఉందని, మొత్తానికి ఈటల చేరిక వల్ల బీజేపీ ఎంతలా నష్టపోతుంది అంటే ఇప్పటిదాకా తెలంగాణాలో వచ్చిన హైప్ కూడా పూర్తిగా తొక్కేసేలా అంటున్నారు. ఇప్పుడున్న పరిస్తితుల్లో ఈటల ఓడిపోతే, బీజేపీకే ఇబ్బందని, ఒకవేళ ఈటల గెలిచినా కూడా అది ఆయన సొంత అకౌంట్ లోకి పోతుందని చెబుతున్నారు.
మొత్తానికి బీజేపీ తెలంగాణాలో ఏ విధంగానూ ఎదిగేలా లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తెలంగాణాను చూసి ఏపీలో ఎదగాలనుకున్న బీజేపీకి ఇక్కడ కూడా చుక్కలే కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాలలో దారుణమైన ఫలితాలు కమలానికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!