మన శరీరం ఎప్పటికప్పుడు వ్యర్థాలను బయటకు మూత్రం, మలం రూపంలో విడుదల చేస్తుందన్న సంగతి తెలిసిందే. శరీరంలోని పలు అవయవాల్లో ఉత్పన్నమయ్యే వ్యర్థాలను శరీరం బయటకు పంపుతుంది. అయితే అలాంటి వ్యర్థాల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. శరీరంలో ప్యూరిన్స్ అనబడే సమ్మేళనాలు విచ్చిన్నమై యూరిక్ యాసిడ్‌గా మారుతాయి. అయితే మహిళలకు అయితే యూరిక్ యాసిడ్ స్థాయిలు 2.4 నుంచి 6.0 మధ్య, పురుషులకు అయితే 3.4 నుంచి 7.0 మధ్య ఉండాలి. అంతకు మించితే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువ అయితే ఆ పరిస్థితిని హైపర్‌యురిసెమియా అని పిలుస్తారు. దీని వల్ల గౌట్, హైపో థైరాయిడిజం, డయాబెటిస్, సోరియాసిస్ వంటి సమస్యలు వస్తాయి. సమస్యను పట్టించుకోకపోతే తీవ్రమైన అనారోగ్యం సంభవించి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతాయి. కనుక యూరిక్ యాసిడ్ స్థాయిలపై జాగ్రత్త తీసుకోవాలి.
ఇక శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువైతే కీళ్లలో తీవ్రమైన నొప్పులు సంభవిస్తాయి. కీళ్లు పట్టుకుపోతాయి. కీళ్లను కదిలించడం కష్టతరమవుతుంది. ఆ ప్రదేశంలో ఎరుపుగా మారుతుంది. వాపులు వస్తాయి. అలాగే పాదాలు, మడమలు, మోకాళ్లు, మోచేతుల్లో తీవ్రమైన నొప్పి కలుగుతుంది.
యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయాలి…
* నీటిని ఎక్కువగా తాగాలి. దీని వల్ల శరీరంలో తయారయ్యే యూరిక్ యాసిడ్ ఎప్పటికప్పుడు బయటకు పోతుంది. తద్వారా దాని స్థాయిలు పెరగకుండా ఉంటాయి.
* మద్యం సేవించడం మానేయాలి. దీని వల్ల కూడా యూరిక్ యాసిడ్ నిల్వలు బాగా పెరిగిపోతాయి. మద్యం మానేస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది.
* అధికంగా బరువు పెరిగితే శరీరంలోని యూరిక్ యాసిడ్ బయటకు వెళ్లడం కష్టమవుతుంది. కనుక బరువు తగ్గే ప్రయత్నం చేయాలి.
* ఫైబర్ (పీచు) ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.
* ప్యూరిన్ల వల్లే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. కనుక ప్యూరిన్లు తక్కువగా ఉండే ఆహారాలను తినాలి. బ్రెడ్, నట్స్, పీనట్ బటర్, కాఫీ వంటి ఆహారాలను తీసుకోవచ్చు. చేపలు, మటన్, పోర్క్ వంటివి మానేయాలి.
* విటమిన్ సితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి.