ఇంద్ర ధనుస్సులో ఏడు రంగులు (VIBGYOR) ఉంటాయి తెలుసు కదా. ఆ రంగులతో ఆ ధనుస్సు చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉంటుంది. అయితే ఇంద్ర ధనుస్సులో ఉన్న ఏడు రంగులను పోలిన అనేక ఆహార పదార్థాలు మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిని నిత్యం తింటే మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ఈ ఆహార పదార్థాల డైట్‌ను రెయిన్‌బో డైట్ అని కూడా వ్యవహరిస్తున్నారు. మరి రెయిన్‌బో డైట్ లో ఏమేం తినాలో, వాటి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. వయోలెట్, ఇండిగో, బ్లూ
ఈ రంగులకు చెందిన ఆహార పదార్థాల్లో పర్పుల్ కాలిఫ్లర్, పర్పుల్ క్యాబేజీ, వంకాయ, బ్లూ బెర్రీలు ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
2. గ్రీన్
ఆకుపచ్చని కూరగాయలైన పాలకూర, కాలిఫ్లవర్, క్యాబేజీ, పచ్చి బఠానీలు, ఇతర ఆకుకూరలు, కొత్తి మీర, కివీలు, గ్రీన్ యాపిల్స్ ఈ కలర్‌కు చెందుతాయి. వీటిని నిత్యం తీసుకుంటే మన శరీరానికి కావల్సిన విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి మన శరీరానికి పోషణను అందిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. జీర్ణాశయ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. క్యాన్సర్ రాకుండా చూస్తాయి.
3. ఎల్లో
పైనాపిల్, నిమ్మకాయలు, బొప్పాయి, మామిడి పండ్లు ఈ కలర్‌కు చెందుతాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. శరీరంలో వాపులు ఉంటే తగ్గుతాయి.
4. ఆరెంజ్
నారింజ పండ్లు, క్యారెట్లు, గుమ్మడి కాయలు ఈ కలర్‌కు చెందుతాయి. ఈ కలర్ లో ఉన్న ఆహారాలను తినడం వల్ల డీఎన్ఏ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. చర్మ సమస్యలు పోతాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఎముకలు దృఢంగా మారుతాయి.
5. రెడ్
పండు మిరపకాయలు, టమాటాలు, పుచ్చ కాయలు, బీట్ రూట్, ఎరుపు రంగు క్యాప్సికం, యాపిల్స్, స్ట్రాబెర్రీలు తదితర ఆహారాలు రెడ్ కలర్‌లో ఉంటాయి. ఈ కలర్ ఆహారాలను తీసుకుంటే శరీర రోగ నిరోధక వ్యవస్థ మెరుగు పడుతుంది. క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది.