ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికి కోపం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే పురస్కారాల విషయంలో తన దృష్టికి రాకుండా పేరు మార్చడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పేరిట ఇచ్చే ప్రతిభా పురస్కారాల పేరును మారుస్తూ ఇచ్చిన జీవో రద్దు చేయలని జగన్ ఆదేశించారు. ప్రతిభా పురస్కారాలకు ఇప్పటివరకు ఉన్నట్టుగా అబ్దుల్ కలాం పేరే పెట్టాలని కూడా ఆయన సూచించారు. అలాగే ప్రభుత్వం అందజేసే పురస్కారాలకు దేశంలోని మహానీయులు పేర్లు కూడా పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.
మహాత్మ గాంధీ, జ్యోతిరావ్ పూలే, అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ వంటి మహానీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని సూచించారు. ఇక జగన్‌కు తెలియకుండానే అధికారులు నేరుగా పురస్కారాల పేర్లు మార్చేస్తూ జీవో ఇవ్వడం కూడా ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం సీఎంకు లేట్‌గా తెలియడంతో ఆయన సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఇక పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇప్పటి వరకు చ్చే ఈ పురస్కారాలను ఈ సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో ప్రతిభ చూపిన వారికే ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివిన వారందరికి కూడా ఈ అవార్డులు ఇచ్చేవారు. ఈ నెల 11వ తేదీన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్బంగా విద్యార్థులకు ఈ ప్రతిభా పురస్కారాలు ఇస్తారు.