పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కబాలి.. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారా..ఎంట్రీని గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారా సోదరుడితో తలైవా భేటీ.. కుటుంబ వ్యవహారమా.. రాజకీయపరమైన చర్చలు జరిగాయా అన్నది ఇప్పుడు తమిళనాట ఆసక్తిగా మారింది.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.. అంటూ రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేసిన రజనీకాంత్.. అందుకు తగిన ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు. ఉరుము లేని పిడుగులాగా బెంగుళూరులో ప్రత్యక్షం అయ్యారు. బెంగళూరులోనే పెరిగి ఓ ఇంటి వాడైన రజనీ తరువాత చెన్నైలో అడుగుపెట్టి సూపర్ స్టార్‌గా ఎదిగారు. రజనీ రాజకీయ ప్రవేశం గురించి ప్రకటన చేసిన తర్వాత ఆయన ప్రతీ అడుగుని వెయ్యి కళ్లతో గమనిస్తున్నారు అభిమానులు. ఎవరికీ ఎలాంటి సమాచారం లేకుండా రజనీకాంత్ బెంగళూరు చేరుకుని సొంత సోదరుడు సత్యనారాయణ ఫ్యామిలీతో పాటు ఆయన సన్నిహితులతో మంతనాలు జరిపారు..
రజనీకాంత్ సొంత సోదరుడు సత్యనారాయణ చాలా కాలంగా బెంగళూరులోనే ఉంటున్నారు. రజనీకాంత్ స్టార్ కాక ముందు ఆయన్ను అన్ని రకాలుగా ఆదుకున్నారు. చడీ చప్పుడు లేకుండా బెంగళూరు వచ్చిన రజనీ.. సన్నిహితుడి కారులో సోదరుడి ఇంటికి వచ్చారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కుటుంబ విషయాలతో పాటు రాజకీయంగా తీసుకోవలసిన నిర్ణయాల విషయంలోనూ వీళ్లిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.
జనవరిలో కొత్త పార్టీ పెడతననాని స్పష్టం చేసిన తలైవా.. వేగంగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో నిలిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీ ప్రకటనకు ముందో ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరును రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సన్నిహితులతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే తన అన్న సత్యనారాయణతో సమావేశమయ్యారు. బెంగళూరులోని సత్యనారాయణ నివాసానికి వెళ్లిన రజినీకాంత్ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
రజనీకాంత్ ప్రకటనతోతో తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. రజనీ ఎంట్రీతో తమకు కలిగే లాభ నష్టాలపై ఇతర పార్టీలు అంచనాకు రాలేకపోతున్నాయి. రజనీ ఎంట్రీ ఇచ్చాక .. ఆయన క్యాంపెయిన్ ఏ రేంజ్‌లో ఉంటుందా అనేది పార్టీల అంచనాలకు కూడా అందడం లేదు. రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో రజనీ ఒంటరిగానే బరిలో దిగుతాడా?, లేక ఏదైనా పార్టీతో జట్టుగా పోటీ చేస్తాడా? అనే దానిపైన కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది.