ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌పై రోజు రోజుకీ యూజర్లలో ఆగ్రహావేశాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. వాట్సాప్ యూజర్ల డేటాను సేకరించి దాన్ని తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటుందని, అలాంటప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అనే పదానికి అర్ధం ఏముంటుందని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. దీంతో వాట్సాప్ తన నూతన ప్రైవసీ పాలసీపై స్పష్టతను ఇచ్చినప్పటికీ ఇంకా యూజర్లలో అపోహలు నెలకొన్నాయి. దీంతో వాట్సాప్ మళ్లీ తాజాగా ఇంకో ప్రకటన విడుదల చేసింది.
వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండదు అని వస్తున్న వార్తల్లో నిజం లేదని వాట్సాప్ తెలిపింది. యూజర్ల ప్రైవసీకి తాము కట్టుబడి ఉన్నామని, ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ కొనసాగుతుందని, కొందరు పనిగట్టుకుని చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని వాట్సాప్ కోరింది.
వాట్సాప్‌లో పంపుకునే మెసేజ్‌లు కేవలం పంపేవారు, చూసేవారికి మాత్రమే యాక్సెస్ అవుతాయని, ఫేస్‌బుక్ లేదా వాట్సాప్ వాటిని చూడలేదని ఆ సంస్థ తెలిపింది. అలాగే వాట్సాప్ లేదా ఫేస్‌బుక్ యూజర్లు ఎవరికి కాల్ చేస్తున్నదీ తెలుసుకోలేదని, వాట్సాప్‌లో లొకేషన్‌ను షేర్ చేసినా ఆ విషయం ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు తెలియదని, యూజర్ల కాంటాక్ట్‌లను వాట్సాప్ ఫేస్‌బుక్‌కు అందించదని, వాట్సాప్ గ్రూపులు ప్రైవేటుగానే ఉంటాయని, యూజర్లు డిజప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌ను పొందవచ్చని, అవసరం అనుకుంటే వారు తమ పూర్తి డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కూడా వాట్సాప్ తెలిపింది. అయితే దీనిపై యూజర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.