ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందిస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే డిజప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఇక త్వరలోనే డిజప్పియరింగ్ ఫొటోస్ ఫీచర్‌ను అందించనుంది. ఈ ఫీచర్‌ను వాట్సాప్ ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.
WaBetaInfo అనే సైట్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌ల ప్రకారం.. డిజప్పియరింగ్ ఫొటోస్ ఫీచర్ కూడా అచ్చం డిజప్పియరింగ్ మెసేజెస్ లాగే పనిచేస్తుంది. యూజర్ తాను పోస్ట్ చేసే ఫొటో లేదా వీడియోను అవతలి యూజర్ చూశాక.. అవి నిర్దిష్టమైన కాల వ్యవధిలోగా అదృశ్యం అయ్యేట్లు టైమర్‌ను సెట్ చేసుకోవచ్చు. వాటిని షేర్ చేసే సమయంలోనే యూజర్లకు ఆ ఆప్షన్ కనిపిస్తుంది.
ఇక అవతలి యూజర్ సదరు ఫొటో లేదా వీడియోను చూడగానే వెంటనే అవి అదృశ్యం అయ్యేట్లు కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో అవతలి వారు ఆ మీడియా ఫైల్స్‌ను తమ ఫోన్లలో సేవ్ చేయలేరు. అలాగే వాటిని ఫార్వార్డ్ కూడా చేయలేరు. అలా చేయాలన్నా వాటిని షేర్ చేసే యూజర్ ముందుగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు కనుక త్వరలోనే ఇది యూజర్లకు అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై ఈ ఫీచర్‌ను వాట్సాప్ అందివ్వనుంది.