సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న వాట్సాప్‌.. బ‌ల్క్ మెసేజ్‌ల‌కు ఇక చెక్‌..!

-

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటూనే వ‌స్తోంది. అయితే ఇప్పుడు మాత్రం న‌కిలీ వార్త‌లను, పుకార్ల‌ను పెద్ద ఎత్తున వ్యాప్తి చెందించే వారిపై బాంబు వేసింది. ఇక‌పై ఇలాంటి వారు పెద్ద ఎత్తున మెసేజ్‌ల‌ను వాట్సాప్‌లో పంపితే అలాంటి వారి అకౌంట్ల‌ను వెంట‌నే నిషేధిస్తామ‌ని వాట్సాప్ తెలిపింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల దృష్ట్యా వాట్సాప్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది.

వాట్సాప్ త్వ‌ర‌లో ఫేక్ న్యూస్‌ను పంపే వారిపై, పెద్ద ఎత్తున మెసేజ్‌ల‌ను వాట్సాప్‌లో పంపే వారిపై చ‌ర్య‌లు తీసుకోనుంది. ఈ మేర‌కు వాట్సాప్ తాజాగా ఒక ప్ర‌క‌ట‌న కూడా చేసింది. పెద్ద ఎత్తున న‌కిలీ వార్త‌ను పంపే వారి వాట్సాప్ అకౌంట్ల‌ను నిషేధిస్తామ‌ని వాట్సాప్ తెలిపింది. దీంతో త్వ‌ర‌లో ల‌క్ష‌ల కొద్దీ అనుమానాస్ప‌ద వాట్సాప్ ఖాతాల‌ను నిర్దాక్షిణ్యంగా తొల‌గించ‌నున్నారు. వాట్సాప్‌లో న‌కిలీ వార్త‌లను పంపే వారే టార్గెట్‌గా ఆ సంస్థ ఇక‌పై చ‌ర్య‌లు తీసుకోనుంది. ఈ క్ర‌మంలోనే రానున్న ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని దేశంలోని రాజ‌కీయ పార్టీల‌కు కూడా వాట్సాప్ హెచ్చ‌రిక‌ల‌ను జారీ చేసింది.

ఎన్నిక‌ల స‌మ‌యంలో సాధార‌ణంగా అన్ని రాజ‌కీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తుంటాయి. అందులో భాగంగా సోష‌ల్ మీడియానూ పార్టీలు వాడుకుంటాయి. అయితే జ‌నాల్లో ఎక్కువ‌గా పాపులారిటీ ఉంది వాట్సాప్‌కే. అందుకే పార్టీలు అందులోనూ పెద్ద ఎత్తున త‌మ ప్ర‌చార సందేశాల‌ను పంపించేందుకు ఆస‌క్తి చూపుతుంటాయి. అయితే ఇక‌పై రాజ‌కీయ పార్టీలు కూడా అలాంటి సందేశాల‌ను పంప‌డానికి వీలు లేద‌ని వాట్సాప్ తెలిపింది. త‌మ ఉచిత సేవ‌ను దుర్వినియోగం కాకుండా చూస్తామ‌ని వాట్సాప్ ప్ర‌తినిధులు తెలిపారు.

త్వ‌ర‌లో జ‌రగ‌నున్న ఎన్నికలకు ముందు రాజ‌కీయ పార్టీలు, అధికారుల‌ను క‌లిసి బ‌ల్క్ మెసేజింగ్‌పై చ‌ర్చిస్తామ‌ని వాట్సాప్ తెలిపింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం అనుమానాస్ప‌దంగా అనిపిస్తున్న 20 ల‌క్ష‌ల ఖాతాల‌ను నెల‌ నెలా బ్యాన్ చేస్తున్నామ‌ని వాట్సాప్ తెలియ‌జేసింది. అనేక గ్రూపుల ద్వారా పెద్ద ఎత్తున సందేశాలు వెళ్తున్నాయ‌ని, వాటిని నిషేధిస్తున్నామ‌ని, అలాగే గ‌తంలో వివాదాస్ప‌దంగా అనిపించిన‌, వేధింపుల‌కు పాల్ప‌డిన లేదా రిజిస్ట్రేషన్‌కు ఉప‌యోగించిన కంప్యూట‌ర్ నెట్‌వ‌ర్క్ వ్య‌వ‌స్థ‌ల‌ను గుర్తిస్తున్నామ‌ని, ఈ క్ర‌మంలోనే త‌మ ప్లాట్‌ఫాంను దుర్వినియోగం చేస్తున్న‌వారిపై చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని వాట్సాప్ తెలిపింది. దీంతో ఇక‌పై పెద్ద ఎత్తున న‌కిలీ వార్త‌ల‌ను వ్యాప్తి చేసే వారి ఆట‌లు ఇక సాగ‌వ‌ని ఆ కంపెనీ ప్ర‌తినిధులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news