వాట్సాప్ వాడుతున్న యూజర్లూ.. జాగ్రత్త.. అందులో ఏజెంట్ స్మిత్ పేరిట ఇప్పుడొక కొత్త మాల్‌వేర్ వ్యాప్తి చెందుతోంది. వాట్సాప్ ఓపెన్ చేయగానే యాడ్స్ ఏమైనా కనిపిస్తుంటే.. మీ ఫోన్లో కచ్చితంగా సదరు మాల్‌వేర్ ఉన్నట్లే లెక్క.
నేటి ఆధునిక టెక్ యుగంలో మన పని అంతా స్మార్ట్‌ఫోన్ల ద్వారానే జరుగుతోంది. అవి లేకుండా మనం ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే మన అవసరాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు వైరస్‌లను వ్యాపింపజేస్తూ మన కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లలో ఉండే సమాచారాన్ని కాజేస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా ఇప్పుడు మరో వైరస్ వాట్సాప్ యూజర్లలో ఆందోళన కలిగిస్తోంది.
వాట్సాప్ వాడుతున్న యూజర్లూ.. జాగ్రత్త.. అందులో ఏజెంట్ స్మిత్ పేరిట ఇప్పుడొక కొత్త మాల్‌వేర్ వ్యాప్తి చెందుతోంది. వాట్సాప్ ఓపెన్ చేయగానే యాడ్స్ ఏమైనా కనిపిస్తుంటే.. మీ ఫోన్లో కచ్చితంగా సదరు మాల్‌వేర్ ఉన్నట్లే లెక్క. ఆ మాల్‌వేర్ వాట్సాప్‌లో యాడ్స్‌ను డిస్‌ప్లే చేస్తుంది. అలాగే ఇతర యాప్‌లను మార్చేసి వాటిల్లో కూడా యాడ్స్ వచ్చేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ మాల్‌వేర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 2.5 కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లకు వ్యాప్తి చెందిందని చెక్ పాయింట్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అనే సంస్థ తెలిపింది.
ఈ ఏజెంట్ స్మిత్ మాల్‌వేర్ భారత్‌లోని ఒకటిన్నర కోట్ల్ ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రవేశించిందని చెక్ పాయింట్ సంస్థ అంచనా వేస్తోంది. ఇది యాప్స్ 9 అనే థర్డ్‌పార్ట్ యాస్ స్టోర్ నుంచి వచ్చి ఉంటుందని తెలుస్తుండగా.. ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన పలువురు వాట్సాప్ యూజర్లు ఈ మాల్‌వేర్ బారిన పడ్డారని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మాల్‌వేర్ ప్రస్తుతం యూజర్లకు చెందిన ఫోన్లలో కేవలం యాడ్స్‌ను మాత్రమే ప్రదర్శిస్తుందని.. కానీ ఈ మాల్‌వేర్ డేటాను కూడా తస్కరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కనుక ఫోన్‌ను ఒక్కసారి పూర్తిగా యాంటీ వైరస్, యాంటీ మాల్‌వేర్ యాప్స్‌తో స్కాన్ చేయాలని, అవసరం అయితే ఫోన్లను ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి మీ ఫోన్‌లో ఉన్న వాట్సాప్‌లోనూ యాడ్స్ వస్తుంటే.. వెంటనే ముందు చెప్పిన సూచనలు పాటించి మీ ఫోన్, డేటాను దుండగుల బారిన పడకుండా సురక్షితంగా ఉంచుకోండి..!