తెలంగాణలో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరిగే ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన స్థానం కావడంతో ఎట్టిపరిస్థితుల్లోనూ తమ స్థానం నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో ఈ సీటును స్వల్ప తేడాతో కోల్పోవడంతో టీఆర్ఎస్ ఎలాగైనా ఉత్తమ్ కంచుకోటలో గులాబీ జెండా ఎగురవేసి సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఒక్క గోషామహాల్ సీటుకే పరిమితమైన కాషాయ పార్టీ.. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా పుంజుకుని ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది. కేసీఆర్ కుమార్తె కవిత, సీనియర్ నేత వినోద్‌కుమార్ లాంటి వాళ్లు సైతం బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు కీలకమైన హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఎవరిని ? అభ్యర్థిగా దించబోతుందనే విషయం తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. బీజేపీ కోర్ కమిటీ భేటీ తర్వాత అభ్యర్థి ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక షెడ్యూల్ వచ్చిన వెంటనే టీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓడిన ఎన్నారై శానంపూడి సైదిరెడ్డినే తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.
ఇక కాంగ్రెస్ పార్టీలో గందరగోళం ఉన్నా కోదాడ మాజీ ఎమ్మెల్యే, ఉత్తమ్‌కుమార్ రెడ్డి భార్య పద్మావతి పేరే ఖరారు కానుంది. ఇక బీజేపీ హుజుర్ నగర్ లో సత్తా చాటాలనుకుంటోంది. అక్కడ చెప్పుకో తగ్గ ఓట్లు తెచ్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇక్కడ ముందుగా టీఆర్ఎస్‌లో ఉన్న తెలంగాణ మలిదశ ఉద్యమం తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను తమ పార్టీలో చేర్చుకుని పోటీ చేయించాలని అనుకుంది.
శంకరమ్మ టీఆర్ఎస్‌లో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆమె వైపు నుంచి సిగ్నల్స్ రానిపక్షంలో బీజేపీ మరో ముగ్గురి పేర్లను లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన రాంరెడ్డి ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన కూడా బీజేపీ సీటు ఆశిస్తున్నారు. నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన టీడీపీ నేత శ్రీకళ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ సీటు ఆశించి భంగపడ్డ అప్పిరెడ్డి కూడా సీటు ఆశిస్తున్నారు. మరి ఫైనల్‌గా హుజూర్‌నగర్ బీజేపీ అభ్యర్థి ఎవరు ? అవుతారో ? చూడాలి.