ఎవరీ సింధియా..?

-

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు రాజకీయ సంక్షోభం నుంచి గట్టెక్కే పరిస్థితులు ఏ మాత్రం కనిపించడం లేదు. సీనియర్‌ నేత జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటుతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన కమల్‌నాథ్‌ గవర్నమెంట్‌ రేపోమాపో కూలిపోవడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సింధియా తిరుగుబాటుపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ నేతలు సింధియాది రాజకీయ నమ్మకద్రోహం అంటుంటే.. ఆయన కుటుంబసభ్యులు మాత్రం సింధియా నిర్ణయం భేష్‌ అంటున్నారు. మరోవైపు చాపకింద నీరులా చేయాల్సినదంతా చేస్తున్న బీజేపీ మాత్రం ఈ విషయంలో నో కామెంట్‌ అంటున్నది. మరి ఇంతటి చర్చకు కారణమైన ఈ సింధియా ఎవరు..? ఆయన కుటుంబ, రాజకీయ చరిత్ర ఏమిటి..? అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జ్యోతిరాధిత్య సింధియా పూర్వీకులు గ్వాలియర్‌ సంస్థాన పాలకులు. అయితే స్వాతంత్ర్యానంతరం దేశంలోని అన్ని సంస్థానాలతోపాటు గ్వాలియర్‌ సంస్థానం కూడా భారత ప్రభుత్వంలో విలీనమైంది. ఈ నేపథ్యంలోనే దశాబ్ద విరామం తర్వాత 1957లో గ్వాలియర్‌ రాజమాత అయిన విజయ రాజె రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గుణ లోక్‌సభ స్థానం నుంచి ఘన విజయం సాధించారు.

దశాబ్ద కాలం కాంగ్రెస్‌లోనే కొనసాగిన విజయరాజె తదనంతర పరిమాణాల నేపథ్యంలో 1967లో బీజేపీ పూర్వరూపమైన జనసంఘ్‌లో చేరారు. 1971లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హవా జోరుగా కొనసాగుతున్న సమయంలోనూ విజయరాజె జనసంఘ్‌ తరఫున బింద్‌ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించి ఔరా అనిపించారు. అంతేగాక గుణ లోకసభ స్థానం నుంచి ఆమె కొడుకు మాధవరావ్‌ సింధియాను కూడా గెలిపించుకున్నారు.

అయితే, ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో తల్లితో విభేదించిన మాధవరావ్‌ సింధియా 1977లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంలో విజయరాజె నలుగురు కుమార్తెల్లో ఒకరైన వసుంధర రాజె 1984లో రాజకీయ అరంగేట్రం చేశారు. అంతకుముందు 1972లో ధోల్పూర్‌ రాజ కుటుంబానికి కోడలుగా వెళ్లిన వసుంధర రాజె ఆ తర్వాత ఏడాదికే భర్తతో విడిపోయింది. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి రెండు సార్లు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అయ్యింది.

విజయరాజె మరో కుమార్తె యశోధర రాజె 1977లో సిద్ధార్థ్‌ బన్సాలీ అనే కార్డియాలజిస్టును పెండ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. అయితే, 1994లో స్వదేశానికి తిరిగొచ్చిన యశోధర రాజె రాజకీయాల్లో చేరారు. మొత్తం ఐదుసార్లు మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. విజయరాజె మరో ఇద్దరు కుమార్తెల్లో పద్మావతి రాజె త్రిపుర రాజకుటుంబానికి, ఉషా రాజె నేపాల్‌ రాయల్‌ ఫ్యామిలీకి కోడళ్లుగా వెళ్లారు. అయితే వారు రాజకీయాలపై ఆసక్తి చూపలేదు.

ఇలా తన తల్లి విజయ రాజె, చెల్లెండ్లు వసుంధర రాజె, యశోధర రాజె ఇతర పార్టీల్లో ఉన్నా మాధవరావ్‌ సింధియా మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగారు. 2001లో విమాన ప్రమాదంలో మరణించే వరకు ఆయన కాంగ్రెస్‌ పార్టీని వీడలేదు. తండ్రి మరణం తర్వాత ఆయన కుమారుడు జ్యోతిరాధిత్య సింధియా రాజకీయ అరంగేట్రం చేశారు. 18 ఏండ్లుగా పార్టీకి ఎనలేని సేవచేసి, రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుడగా మెలిగిన జ్యోతిరాధిత్య.. కమల్‌నాథ్‌ సర్కారు తనను ఏ మాత్రం లెక్కచేయక పోవడాన్ని సహించలేక తిరుగుబాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news