అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… ప్రపంచ ఆరోగ్య సంస్థ మధ్య మాటల యుద్ధం మొదలయింది. చైనా పక్షపాతిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మారింది అని డోనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేసారు. దీనిపై ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ స్పందించారు. కరోనా వైరస్ కు రాజకీయాలు అంటించ వద్దని ఆయన విజ్ఞప్తి చేసారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు జాతి, మత, కుల, వర్ణభేదాలు లేవని, అసలు క్వారంటైన్‌కు పంపాల్సింది కొవిడ్-19ని అని ప్రపంచ దేశాలు గుర్తించాలన్నారు.
అందరూ కలిసి కట్టుగా పోరాటం చేయడం ఒక్కటే మార్గం అని ఆయన పేర్కొన్నారు. నిధులు నిలిపి వేస్తున్నామని ట్రంప్ చెప్పడాన్ని ఆయన ఖండించారు. తాము ప్రతి ఒక్క దేశానికీ అత్మీయుల౦ అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రపంచానికి తాను రెండు విషయాలు స్పష్టం చేయదలుచుకున్నా అని వ్యాఖ్యానించిన ఆయన… ఒకటి జాతీయ సమైక్యత పాటించడం, రెండవది ప్రపంచ సంఘీభావమని అన్నారు.
ఈ వైరస్‌ను రాజకీయం చేయటానికి బదులు నేతలు జాతీయ, అంతర్జాతీయ ప్రయోజనాల కోసం కృషిచేయాలని ఆయన హితవు పలికారు. కలిసి నడవకుంటే ఎంత గొప్ప దేశమైనా కష్టాల్లో పడాల్సిందేనని అమెరికాకు పరోక్ష హెచ్చరికలు చేసారు. చైనా, అమెరికా, జి-20 దేశాలే కాకుండా ప్రపంచమంతా కరోనా వ్యతిరేక పోరాటంలో ఐక్యమవ్వాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.