చాలా కాలం జైలు జీవితం గడిపి, నిర్దోషిగా బయటకు వచ్చిన తక్కువ టైంలోనే ప్రొ.సాయిబాబా మృతి చెందడం శోచనీయం అని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సాయిబాబా మరణం నేపథ్యంలో సోమవారం మౌలాలిలోని సాయిబాబా నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి నివాళి అర్పించారు.హరీశ్ రావు మాట్లాడుతూ.. సాయిబాబా మృతి బాధాకరం అని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
సుప్రీంకోర్టు నిర్దోషి అని తీర్పు చెప్పినా దశాబ్దకాలం పాటు ఆయనతో పాటు, కుటుంబ సభ్యులు పడిన వేదన వర్ణనాతీతం అన్నారు.ప్రొఫెసర్‌గా పనిచేస్తూ,ఆ హొదాలోనే ప్రాణాలు వదలాలని అనుకున్నారు.కానీ, దురదృష్టవశాత్తూ ఉద్యోగం కూడా కోల్పోయారని గుర్తుచేశారు. సాయిబాబా పడిన వేదనకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 90శాతం అంగవైకల్యం ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలి.కానీ, అలాంటి వ్యక్తి పట్ల అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం బాధాకరం అని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.