కాంగ్రెస్ ప్రభుత్వంతో తెలంగాణలో ఏమి మారలేదని ఎంపీ రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీల అమలులో వైఫల్యంపై పోరాటం చేయాలని రాజకీయ తీర్మానం చేశామని అన్నారు.రైతు భరోసా 15 వేలు ఇస్తామని చెప్పారని.. ఇప్పటి వరకు లేదని మండిపడ్డారు. గ్రూప్ 1 పోస్టుల్లో అదనంగా కేవలం 60 పోస్టులు మాత్రమే ఇచ్చారని ఆయన వెల్లడించారు. ఒక పరీక్షకు మరో పరీక్షకు ముప్పై రోజుల గడువు ఇవ్వాలని కోరితే ప్రతిపక్షాలు పనిలేక చేస్తున్నాయని విమర్శించడం సిగ్గుచేటని ఆయన ఫైర్ అయ్యారు.
ప్రతిపక్షంలో ఒకమాట… అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ ఒక నెల వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు.4 లక్షల నెల జీతం ఏడు మాసాలుగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారని.. నాలుగు వేల నిరుద్యోగ భృతి మాత్రం ఇవ్వడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను అరెస్ట్ చేయకుండా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారులను అరెస్ట్ చేస్తున్నారు.. పనులు చేయించిన అప్పటి మంత్రులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.