ప్రపంచ చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పురస్కారం ఆస్కార్. జీవితంలో ఒక్కసారైనా ఈ అవార్డును ముద్దాలాడాలని తపిస్తుంటారు. అయితే కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్, శ్యామ్‌సింగరాయ్ చిత్రాలు 95వ అకాడమీ అవార్డ్స్ నామినేషన్స్‌కు ఎంపికయ్యాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సారి అలా ఆస్కార్ చరిత్రను తెలుసుకుందాం.
హాలీవుడ్ నటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సాంకేతిక నిపుణులతో కూడిన 5 విభాగాలతో 1927లో ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ’ ఏర్పడింది. అదే 1929 నుంచి చలన చిత్ర రంగంలో విశేష ప్రతిభ చూపిన వారికి ‘అకాడమీ ఆవార్డ్ ఆఫ్ మెరిట్’ పేరిట పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించింది. ఆ తర్వాత, వీటిని ఆస్కార్ పురస్కారాలుగా పిలవడం మొదలైంది. ఆస్కార్ పేరు ఎలా వచ్చిందో తెలుసుకునేముందు ఆ అవార్డు ఎలా రూపొందిందో చూద్దాం..
ఆస్కార్ ప్రతిమ.. కాంతులీనే పసిడి వర్ణంతో, ఓ యోధుడు రెండు చేతులతో వీర ఖడ్గం చేతపట్టి ఫిల్మ్ రీలుపై ఠీవీగా నిల్చొన్నట్టు కనిపిస్తుంది. ఈ రూపును ఎంజీఎం స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్ సృష్టించారు.
ఆస్కార్ ప్రతిమ కింది భాగంలోని రీలు చుట్టులో 5 చువ్వలుంటాయి. అకాడమీలోని 5 విభాగాలకు అవి సూచికలు. ఎమిలో ఫెర్నాండెజ్ అనే నటుడిని నగ్నంగా నిలబెట్టి అతడి ఆకారం నుంచి స్ఫూర్తిపొంది.. గిబ్బన్స్ ఈ ప్రతిమను రూపొందించాడట. అందుకే ఆస్కార్ ప్రతిమ నగ్నంగా కనిపిస్తుంది.
ప్రతిమ నమూనా రూపొందాక దానికనుగుణంగా త్రీ డైమెన్షన్స్ ప్రతిమను తయారు చేసే పనిని లాస్ ఏంజెల్స్‌కు చెందిన ప్రసిద్ధ శిల్పి జార్జ్ స్టాన్లీ భుజానికెత్తుకున్నాడు. కాంస్యంతో తయారు చేసి 24 క్యారెట్ల బంగారు పూత అద్దిన.. 13.5 అంగుళాల ఎత్తు, 8.5 పౌండ్ల (450 గ్రాములపైగా) బరువున్న ఆస్కార్ ప్రతిమ స్టాన్లీ చేతుల్లో పురుడు పోసుకుంది.
ఈ ప్రతిమ ఆధారంగా షికాగోలోని ఆర్.ఎస్. ఓవెన్స్ అండ్ కంపెనీ ఆధ్వర్యంలో ఏటా ఆస్కార్ ప్రతిమలను తయారు చేస్తారు. ఒక్కో ఆస్కార్ ప్రతిమ తయారీకి సుమారు 1000 డాలర్లకుపైగా ఖర్చవుతుందని అంచనా. 50 ఆస్కార్ ప్రతిమలను రూపొందించేందుకు దాదాపు నెల సమయం పడుతుందట.
ఈ పురస్కారాలకు ఆస్కార్ అని పేరు రావడం వెనక ఓ ప్రచారం ఉంది. తొలిసారి ఈ పురస్కార ప్రతిమను చూసిన అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గరెట్ హెర్రిక్.. అందులోని యోధుడు అచ్చం తన అంకుల్ ఆస్కార్‌లా ఉన్నాడని అందట. ఆ తర్వాత హాలీవుడ్ కాలమిస్ట్ సిడ్నీ స్కోల్‌స్కీ తన వ్యాసంలో వీటిని ఆస్కార్ పురస్కారాలని ప్రస్తావించాడట. అలా ‘ఆస్కార్’ వాడుకలోకి వచ్చింది.
మొదటిసారిగా ఆస్కార్ అందుకున్న నటుడు ఎమిల్ జన్నింగ్స్. ‘ది లాస్ట్ కమాండ్’ చిత్రానికిగానూ ఆయన ఉత్తమ నటుడిగా ఈ అవార్డు స్వీకరించారు.