ప్రేమ కథలకు జీవం ఉండాలి జీవం లేని కథలు సినిమాటిక్ డ్రామాతో నెగ్గుకు రావు రాలేవు కూడా ఇవాళ జీవం లేని కథలకు కళలకు
స్టార్ డమ్ పేరిట డ్రామా నడిపి జనం మీదకు రుద్దడం ఓ పెద్ద తప్పు.ఈ కథకు ఆ సీన్ లేదు అని ఒప్పుకోకపోవడమే ఇప్పటి తరం చేస్తున్న తప్పు.. ఒప్పుకోండి రాధే శ్యామ్ కథ ప్యాన్ ఇండియా ఫిల్మ్ కు సరిపోని సరిపోలని కథ అని!
మామూలు కథ అతి సాదాసీదా కథనం అయినా కూడా కొన్ని సినిమాలు మంచి ఫలితాలు అందుకుంటున్నాయి ఇవాళ. అంటే వాటిలో ఏ అతి లేకపోవడమే ప్రధాన బలం కావొచ్చు. వర్షం సినిమాతో మంచి ఫాంలో ఉన్న ప్రభాస్ తరువాత అదే ఒరవడి కొనసాగించి ప్రేమ కథలకు కేరాఫ్ అయ్యారు.ఆ ఒరవడిలో ఇవాళ ఆయన లేరు. ఓ విధంగా ఇలాంటి కథలు ఏ రకంగానూ ఇవాళ ఆయన కు ఉన్న బాడీ లాంగ్వేజ్ కు ఏ మాత్రం నప్పదు కనుక సినిమా ఆశించిన రీతిలో మంచి ఫలితం అందుకోలేదు అన్నది వాస్తవం.
బాహుబలి సిరీస్, సాహో లాంటి పాన్ ఇండియా సినిమాల తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రం రాధే శ్యామ్.జిల్ ఫేం రాధా కృష్ణ దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రభాస్ సొంత బ్యానర్లు యూవీ క్రియేషన్స్ మరియు గోపి కృష్ణ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని మార్చ్ 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు.
విడుదలైన నాటి నుండి నేటి వరకు ప్రజలు మరియు ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలు అందులేకపోవడంతో మొదటి రోజు నుంచే నెగటివ్ టాక్ వచ్చింది.ఈ టాక్ సామాజిక మాధ్యమాల్లో వ్యాపించి ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా చేసింది.అందువల్ల మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ తప్ప తర్వాత రోజుల్లో సినిమా నిర్మాతలు అనుకున్న కలెక్షన్స్ కూడా రాలేదు. రాధే శ్యామ్ చిత్రం జనాలను ఆకట్టుకొకపోవడానికి ముఖ్య కారణం చిత్రకథ.ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా లెవల్ రేంజ్ ఉన్న నటుడిగా మారిన తర్వాత దేశవ్యాప్తంగా పెరిగిన క్రేజ్ కారణంగా ప్రేక్షకులు పాన్ ఇండియా అప్పీల్ కలిగిన మాస్ చిత్రాలను ప్రభాస్ నుండి ఆశించారు.కానీ రాధే శ్యామ్ పూర్తి గా ప్రేమ కథ చిత్రం కావడంతో వారందరూ నిరాశ చెందారు.
రాధే శ్యామ్ కు ఉన్న మరో మైనస్ హీరోయిన్ పూజా హెగ్డే .పూజా ఇప్పటి వరకు నటించిన పాన్ ఇండియా చిత్రాలన్నీ పరాజయం పొందిన విషయం తెలిసిందే. ముఖ్యంగా చరిత్రాత్మక చిత్రం మొహంజదారో అతి పెద్ద డిజాస్టర్. పూజా కు పాన్ ఇండియా చిత్రాలు కలిసి రావని హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరున్న ఆమెను తీసుకొని మరో తప్పు చేశారు.
డార్లింగ్ చిత్రం తర్వాత ప్రభాస్ తీసిన పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రం రాధే శ్యామ్.కానీ అప్పటికీ,ఇప్పటికీ ప్రభాస్ లో చాలా మార్పు వచ్చింది.డార్లింగ్ సినిమాలో నటించిన ప్రభాస్ లో ప్రేమికుడి లక్షణాలు ఉన్నాయి.కానీ రాధే శ్యామ్ లో నటించిన ప్రభాస్ లో మాత్రం పెద్ద మనిషి తరహా లక్షణాలు కనిపించాయి.ఫ్యాన్స్ సైతం ఈ చిత్రాన్ని డార్లింగ్ తో పోల్చుకుంటూ ఉన్నారు.
ఆఖరుగా.. ఈ సినిమా విఫలతకు మరో కారణం విశ్లేషించాలంటే సోషల్ మీడియాలో రాధే శ్యామ్ సినిమా విడుదలకు ముందు కొంతమంది ప్రభాస్ అభిమానులు చేసిన హంగామా సైతం వెగటుపుట్టించింది.
ప్రభాస్ సినిమా అంటే అన్ని వర్గాలకు చెందిన ప్రేక్షకులు ఇష్టపడతారు.కానీ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న అతి కూడా ప్రేక్షకులను ప్రభాస్ సినిమాలకు దూరం చేస్తూ వస్తుంది.బాహుబలి తో మొదలై రాధే శ్యామ్ మీద ఆ ప్రభావం బాగా పడిపోయింది.సినిమా ఇవాళ అనుకున్న ఫలితం సాధించలేకపోయింది అని చెప్పడం ఒకింత బాధాకరం అయినా కూడా ఇదే చేదు నిజం.