శమీ వృక్షం క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఉద్భవించిన దేవతా వృక్షాల్లో ఒకటని పురాణాలు చెబుతున్నాయి. అందునే దానికి ఉన్న మహిమల వల్లే ఆ వృక్షాన్ని పూజించాలని చెబుతారు.
శమీ శమయతే పాపం, శమీ శత్రువినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ!!
కరిష్యమాణ యాత్రాయా యథాకాలమ్ సుఖం మయా
తత్ర నిర్విఘ్న కర్త్రీవం భవ శ్రీరామ పూజితా!!
దసరా రోజున శమీ వృక్షానికి పూజ చేసేటప్పుడు చదివే మంత్రం ఇది. దీని అర్థం ఏమిటంటే.. ఓ శమీ వృక్షమా.. నా పాపాలను పోగొడుతూ శత్రువులను పరాజయం పాలు చేయడం నీ విశిష్టత. అర్జునుడు నీ దగ్గరే ధనుస్సు దాచాడు. రాముడికి నువ్వే ప్రియం చేకూర్చావు. శ్రీరాముడు పూజించినట్లే నేనూ నిన్ను పూజిస్తున్నాను. ఎలాంటి విఘ్నాలూ కలగకుండా నా విజయ యాత్రను కొనసాగించు.. అంటూ శమీ వృక్షాన్ని ప్రార్థిస్తారు. ముఖ్యంగా దసరా రోజునే ఈ వృక్షానికి పూజ చేస్తారు. ఎందుకంటే..
పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగించుకుని శమీ వృక్షం వద్దకు వచ్చి పూజలు చేసి దానిపై దాచిన తమ ఆయుధాలను తీసుకుని వాటితో కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై విజయం సాధించారు. ఇక రాముడు కూడా రావణాసురున్ని అంతమొందించే ముందు శమీ వృక్షాన్ని పూజించాడని, అందుకనే రాముడు విజయం సాధించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే శమీ వృక్షాన్ని పూజిస్తే పాపాలు పోతాయని, మన శత్రువులు నశిస్తారని పండితులు చెబుతున్నారు.
ఇక శమీ వృక్షం క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఉద్భవించిన దేవతా వృక్షాల్లో ఒకటని పురాణాలు చెబుతున్నాయి. అందునే దానికి ఉన్న మహిమల వల్లే ఆ వృక్షాన్ని పూజించాలని చెబుతారు. ఇక పురాణ కాలం నుంచి శమీ వృక్షాన్ని విజయానికి చిహ్నంగా భావిస్తూ వస్తున్నారు. అందుకనే ఆ వృక్షానికి దసరా రోజున పూజలు చేస్తారు. కాబట్టి దసరా రోజున ఎవరైనా సరే.. ఆ వృక్షాన్ని పూజిస్తే.. ఎందులోనైనా విజయం సాధించవచ్చు..!