మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారం దక్కించుకున్న బీజేపీ మరోసారి కూడా విజయం దక్కించుకుంటుందా.. వరుసగా మూడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా. అవునంటున్నారు విశ్లేషకులు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవడంతో ఆ పార్టీలో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది.
అయోధ్యలో రామాలయం కట్టుకోవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పార్టీ లక్ష్యాలను ఒక్కొక్కటిగా నెరవేర్చినట్టయిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే 70 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న కాశ్మీర్ సమస్యను ఇటీవలే పరిష్కరించారు. ఆర్టికల్ 370, 35ఏ అధికరణాలు రద్దు చేశారు.
2024 నాటికల్లా రామమందిరాన్ని పూర్తి చేయడం ఖాయమని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఆ తర్వాత అదే నినాదంతో ఎన్నికల్లో భాజపాను మరింత మెజార్టీతో తిరిగి సాధిస్తుందని నమ్ముతున్నారు. రామాలయమే మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తుందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మోడీ నాయకత్వ పటిమను చూసి ఇప్పటికే చాలా పార్టీల రాజ్యసభ సభ్యులు ఆ పార్టీలో చేరుతున్నారు. అందువల్ల మరికొన్ని కీలక బిల్లుల ఆమోదం కూడా సులభం కానుంది. మరోవైపు మోడీ జమిలి ఎన్నికల గురించి కూడా పదేపదే మాట్లాడుతున్నారు. జమిలి ఎన్నికలకు వెళ్లినా మోడీ సర్కారు మరోసారి అధికారం కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.