తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి ఏమో గాని… ఆ పార్టీ నేతలు మాత్రం వ్యాపారంలో అన్ని రకాలుగా వృద్ది సాధించారు అనేది వాస్తవం. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై ఇలా ప్రతీ ఒక్క చోటా పెట్టుబడులు భారీగా పెట్టేశారు. దోచుకున్నారో… దాచుకున్నారో గాని పెట్టుబడులు మాత్ర౦ భారీగా పెట్టి తమ వ్యాపారాలను విస్తరించారట. ఇప్పుడు వాటి భవిష్యత్తు మీద వారికి ఆందోళన నెలకొంది. కొందరు తమతో కలిసి వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు పక్కకు కూడా తప్పుకుని వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్తున్నారు.
అదంతా ఒక ఎత్తు అయితే… రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాల్లో మాజీ మంత్రులు, పేరున్న మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు వ్యాపారాలు మొదలుపెట్టారు. ఆ వ్యాపారాల కోసం ఇప్పుడు వారిలో ఆందోళన మొదలయింది. మళ్ళీ అధికారంలోకి వస్తామనే చంద్రబాబు మాటలను నమ్మి భారీగా వారు వ్యాపారాలు మొదలుపెట్టారు. ఇప్పుడు వాటి మీద ప్రభుత్వం ఎక్కడ దృష్టి పెడుతుందో అనే ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది. దీనితో ఇప్పుడు జాగ్రత్త పడటం మొదలుపెట్టారు.
గతంలో పార్టీలో ఉండి వెళ్ళిపోయిన వారి ద్వారా మంత్రులతో పరిచయాలు పెంచుకుని, వ్యాపారాలను కొనసాగించాలని భావిస్తున్నారట. ఇప్పుడు ప్రభుత్వం తమను ఇబ్బంది పెడితే వ్యాపార పరంగా ఇబ్బంది పడతాం అనే ఆందోళన వారిలో ఉంది. దీనితో పరిచయాల ద్వారా వ్యాపారాలను బలోపేతం చెయ్యాలని వారు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో ఉన్న సీనియర్ నేతలు అయితే ఎక్కువగా మంత్రులను కలిసి తమ వైపుకి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారట.
అయితే ఇందుకు మంత్రులకు కూడా ఎంతో కొంత ముట్ట చెప్పాల్సిందే అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంత్రులు కూడా తమ వాటా తమకు ముట్టడంతో వాళ్లు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు భోగట్టా..! ఇప్పుడు ఈ బేరాల రాజకీయం ఎక్కువగానే జరుగుతుంది. అంటే వీళ్లకు పార్టీ కన్నా బిజినెస్ మద్దు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన చంద్రబాబు… ఏం అనాలో అర్ధం కాక మిన్నకుండిపోయారని అంటున్నారు.