మనుషులకన్నా ఎన్నో వేలరెట్లు బలవంతమైన డైనోసార్లే కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ జాతి పూర్తిగా ఎన్నో లక్షల ఏళ్ల కిందటే అంతరించిపోయింది. అందుకు పురాతత్వ శాస్త్రవేత్తలు, చరిత్రకారులు అనేక కారణాలు చెబుతుంటారు. అప్పట్లో భూమిపై ఏర్పడిన ఉత్పాతాల కారణంగా కేవలం డైనోసార్లే కాక.. అనేక జాతులకు చెందిన జీవరాశులు అంతరించిపోయాయని అంటుంటారు. అగ్ని పర్వతాలు పేలడం, సునామీలు రావడం, భారీ గ్రహశకలాలు భూమిని ఢీకొట్టడం, అంతుచిక్కని మహమ్మారి వ్యాధులు రావడం, తినేందుకు తిండి దొరక్క కరువు సంభవించడం.. వంటి అనేక కారణాల వల్ల డైనోసార్లు, ఇతర జీవరాశులు అంతరించిపోయాయని వారు అంటుంటారు. అయితే ప్రస్తుతం ఇదే తరహా పరిస్థితి మనుషులకు కూడా రానుందా..? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్లెస్ డార్విన్ చెప్పినట్లు.. ఏ జాతికి చెందిన జీవరాశులు అయినా సరే అవి సమయం వస్తే.. అంతరించిపోక తప్పదు. ఒక జాతికి చెందిన జీవరాశులు పోయి మరొక జాతికి చెందిన జీవరాశులు పుట్టుకువస్తాయి. అది ప్రకృతి చక్రం. ఎప్పుడూ అది సంభవిస్తూనే ఉంటుంది. అందుకనే ఇప్పుడు మానవజాతి అంతానికి సమయం దగ్గర పడిందని నిపుణులు అంటున్నారు. ఓ వైపు భారీ ఆస్టరాయిడ్లు భూమి వైపు దూసుకువస్తున్నాయి. గతంలో భూమిపై ఎన్నడూ లేని ఉత్పాతాలు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. కరోనా లాంటి మహమ్మారి వ్యాధులతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే.. మనుషులు ఇక భూమిపై అంతమవుతారనే అనిపిస్తుందని.. పలువురు పేర్కొంటున్నారు.
అయితే ఇప్పటికిప్పుడు మానవ జాతి అంతం అయ్యేలా మరీ తారా స్థాయిలో ఉత్పాతాలు ఏవీ ఏర్పడడం లేదు. కానీ ఆ సమయం దగ్గర్లోనే ఉంటుందని అంటున్నారు. ప్రకృతి పట్ల మనిషి ప్రవర్తిస్తున్న తీరుకు మనం త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంటున్నారు. మనం చేస్తున్న అనేక తప్పిదాలే మన జాతి అంతానికి కారణం కాబోతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. మరి ముందు ముందు భూమిపై ఇంకా ఎలాంటి విపరీత పరిస్థితులు ఏర్పడుతాయో చూడాలి..!