జమిలి పై పోరాటానికి భారత్ బంద్ నాంది కాబోతుందా..?

-

కేంద్రంలో ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటనుంచీ జమిలి ఎన్నికల చర్చ జరుగుతూనే ఉంది. స్వయంగా ప్రధాని మోడీ కూడా జమిలి దేశానికి అవసరం అనడం.. మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు రైతుల భారత్ బంద్ తరుణంలో.. మరోసారి జమిలి రాజకీయం తెరపైకి చవ్చింది. కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ప్రాంతీయ పార్టీలు.. భవిష్యత్ లో జమిలి ఎన్నికల్లో పోరుకు సన్నాహకంగా భారత్ బంద్ ను ఉపయోగించుకుంటున్నాయనే వాదన వినిపిస్తోంది.

జమిలి ఎన్నికలకు బీజేపీ మొదట్నుంచీ అనుకూలంగానే ఉంది. మోడీ రెండోసారి ప్రధాని అయ్యాక వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రచారం ఊపందుకుంది. దీనికి తోడు దేశవ్యాప్తంగా ఒకే ఓటర్ల జాబితా, జమిలి అవసరంపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు.. చర్చనీయాంశంగా మారాయి. దీంతో జమిలి కచ్చితమనే నిర్ణయానికి వచ్చిన ప్రాంతీయ పార్టీలు.. భారత్ బంద్ కు మద్దతిచ్చి.. ఇప్పట్నుంచే కేంద్రంపై ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఎప్పట్నుంచో నరేంద్ర మోడీని సవాల్ చేయాలనుకుంటున్న విపక్షాలకు రైతుల ఉద్యమం ఆయుధంలా దొరికింది. మోడీ గద్దెనెక్కినప్పట్నుంచీ ఇంతవరకూ సామాన్యుల నుంచి ఈ లెవల్లో వ్యతిరేకత వచ్చిన దాఖలాల్లేవు. నోట్లరద్దు, జీఎస్టీ టైమ్ లో కూడా పార్టీలు మాత్రమే ఆందోళనకు దిగాయి. కానీ ప్రజల నుంచి వాటికి మద్దతు లభించలేదు. అయితే వ్యవసాయ చట్టాలపై మాత్రం రైతులు రోడ్డెక్కారు. ఉత్తరాది రైతులు ఢిల్లీని దిగ్బంధించడంతో.. కేంద్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. పార్లమెంట్ లో విపక్ష పార్టీల్ని బుల్డోజ్ చేసిన ఎన్డీఏ సర్కారు.. రైతుల దెబ్బకు మల్లగుల్లాలు పడుతోంది. మొదట్లో చట్టాల్లో మార్పులు చేసేది లేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా.. ఇప్పుడు రైతులతో చర్చలు జరిపి సవరణలకు కూడా సిద్ధమైంది.

చట్టాల ఉపసంహరణే ఏకైక డిమాండ్ గా రైతులు భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో రాజకీయం మరింత వేడెక్కింది.ఇదే అదనుగా కేంద్రంపై అసంతృప్తిగా ఉన్న ప్రాంతీయ పార్టీలు భారత్ బంద్ కు మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే కాంగ్రెస్ మిత్రపక్షాలు, ఆప్ రైతుల ఉద్యమానికి మద్దతిస్తుండగా.. ఇప్పుడు బంద్ కు వివిధ కార్మిక సంఘాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా సంఘీభావం తెలపడంతో.. ఇది కేంద్రం వర్సెస్ ప్రాంతీయ పార్టీలుగా మారింది.

జమిలి పేరుతో తమ అస్తిత్వాన్ని దెబ్బతీయాలనుకున్న బీజేపీకి షాకివ్వాలని ప్రాంతీయ పార్టీలు డిసైడైనట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కేంద్రంపై పోరాటానికి నాయకత్వం వహిస్తున్న పరిస్థితి. వీరు మరిన్ని ప్రాంతీయ పార్టీల్ని కలుపుకుని భవిష్యత్తులో కేంద్రంపై పోరాటాన్ని కంటిన్యూ చేయాలని వ్యూహం రచిస్తున్నారు

జమిలి ఎన్నికలు ఖాయమనే అంచనాకు వచ్చిన ప్రాంతీయ పార్టీలు.. ఇప్పట్నుంచే శక్తియుక్తులు కూడగట్టుకుని.. ఓ కూటమిగా బీజేపీపై యుద్ధం చేయాలని భావిస్తున్నాయి. అందుకు రైతు ఉద్యమమే సరైన వేదిక అనే నిర్ణయానికి వచ్చాయి. భారత్ బంద్ లో ఉమ్మడి కార్యాచరణ తీసుకుంటే.. ఇక జమిలి వచ్చేవరకు అదే పంథా కొనసాగించాలని అనుకుంటున్నాయి. ఇప్పటికే డిసెంబర్ రెండోవారంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సభ పెడతానని కేసీఆర్ ప్రకటించిన తరుణంలో.. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version