పైలెట్ ప్రాజెక్ట్ గురించి త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా : ఎంపీ అర్వింద్

-

ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు పైలెట్ ప్రాజెక్టు కోసం కొడంగల్, మధిర అసెంబ్లీ నియోజవర్గాలను ప్రభుత్వం ఎంపిక చేయడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. పైలట్ ప్రాజెక్టుల విషయంలో మీ సొంత నియోజకవర్గాలను మీరు చూసుకుంటే మరి తెలంగాణను ఎవరు చూసుకోవాలని ప్రశ్నించారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అర్వింద్.. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటులో మీ విజన్ ఏంటో తెలియాలంటే రాష్ట్ర జాగ్రఫికల్ గా పైలట్ ప్రాజెక్టులను ఎంచుకోవాలే తప్ప సొంత నియోజకవర్గాల్లో ఎంపిక చేస్తే దాన్ని అడ్మినిస్ట్రేషన్ అనరని విమర్శించారు. ఉమ్మడి ఏపీలో రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ యూనివర్సిటీలను నెలకొల్పి రాయలసీమ యూనివర్సిటీకి అధిక నిధులు కేటాయించి విమర్శల పాలయ్యారని గుర్తు చేశారు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం పైలట్ ప్రాజెక్టు కింద ఆర్మూర్ ను ఎంచుకుంటే ఉత్తర తెలంగాణకు అది సెంటర్ పాయింట్ అవుతుందని దాని వల్ల ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యం ఏంటో స్పష్టం అవుతుందన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద రెండు యూనిట్లు ఎంచుకుంటే ఒకటి ఉత్తర తెలంగాణకు మరొకటి దక్షిణ తెలంగాణ నుంచి ఉండాలని లేదా నాలుగు ఎంచుకుంటే రాష్ట్రం నలుదిక్కులా ఏర్పాటు చేస్తే ఆ పథకాల వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలను పైలట్ ప్రాజెక్టు కింద ఆర్పూర్ లో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి కోరుతున్న డిమాండ్ న్యాయమైనదేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news