మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని మందుబాబులకు జిల్లా ఎక్సైజ్ శాఖ చేదువార్త చెప్పింది. మునుగోడు ఉప ఎన్నిక కోడ్ నేపథ్యంలో నవంబర్ 1న సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారి సంతోష్ ప్రకటించారు. ఉప ఎన్నిక ప్రకటన తర్వాత మునుగోడు పరిధిలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి.
ఏడు మండలాలలో 128 మంది ఎక్సైజ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు 2,705 లీటర్ల మద్యం, రెండు బైక్లు సీజ్ చేసి 48 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 118 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ. 5.59 లక్షలు ఉంటుందని అన్నారు. ఇక నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నికకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 6న ఫలితాలు విడుదల కానున్నాయి.