హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట చౌరస్తాలో ఓ మహిళను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వివరాల్లోకి వెళ్లితే.. బోరబండ కు చెందిన రమ్య ఎర్రమంజిల్ లోని ఓ సంస్థలో హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తుంది. పంజాగుట్ట చౌరస్తాలో ఆర్టీసీ బస్సు దిగిన ఆమె ఎర్ర మంజిల్ వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న క్రమంలో జగదిరిగుట్ట నుంచి మెహిదీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర రక్తస్రావమైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
మరణించిన రమ్యకు ఇద్దరు ఆడపిల్లలు, 8 ఏళ్ల బాబు ఉన్నాడు. మృతురాలి భర్త అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటుండగా.. కుటుంబ పోషణ మొత్తం రమ్యనే చూసుకుంటుంది. కుటుంబానికి ఆసరాగా నిలిచిన రమ్య అకస్మాత్తుగా మృత్యువు ఒడిలోకి చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మాకు తోడుగా ఉన్న మా అమ్మ మరణించిందని.. మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని పిల్లలతో పాటు బంధువులు వేడుకున్నారు. ప్రభుత్వం సాయం చేస్తే ఆ కుటుంబానికి ఆసరాగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.