ప్రస్తుత తరుణంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు మరీ శృతి మించిపోయాయి. జనాలను అనేక రకాలుగా దోచుకుంటున్నారు. ఆన్‌లైన్ వేదికగా నకిలీ అడ్వర్టయిజ్‌మెంట్లు ఇస్తూ జనాలను మోసం చేస్తున్నారు. వారి వివరాలను సేకరించి అనంతరం ఆ సమాచారంతో వారి బ్యాంకుల్లో ఉండే డబ్బులను కాజేస్తున్నారు. బెంగళూరులో ఓ మహిళకు కూడా సరిగ్గా ఇలాగే జరిగింది.
దక్షిణ బెంగళూరులోని యెలచెనహల్లి అనే ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల సవితా శర్మ ఫేస్‌బుక్‌లో ఓ యాడ్ చూసింది. రూ.250 పెట్టి మీల్స్ ఆర్డర్ చేస్తే మరో 2 మీల్స్ ఫ్రీగా వస్తాయని అందులో ఉంది. దీంతో ఆమె సదరు యాడ్‌ను ఇచ్చిన వారికి ఫోన్ చేసింది. వారు ముందుగా రూ.10 తో ఆన్‌లైన్‌లో ఆర్డర్ బుక్ చేసుకోవాలని, మిగిలిన మొత్తాన్ని మీల్స్ తెచ్చాక క్యాష్ రూపంలో ఇవ్వవచ్చని తెలిపారు. నిజమే అని నమ్మిన ఆమె వారు ఆమెకు పంపిన లింక్‌ను ఓపెన్ చేసి అందులో పేమెంట్ నిమిత్తం డెబిట్ కార్డు వివరాలను పిన్ నంబర్‌తో సహా ఎంటర్ చేసింది. తరువాత క్షణాల్లోనే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.49,996 మాయమయ్యాయి.
అయితే ఇదే విషయమై మళ్లీ అదే ఫోన్ నంబర్‌కు కాల్ చేయగా స్విచాఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆమె అక్కడి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా సదరు రెస్టారెంట్ నిజానికి అక్కడి సదాశివనగర్ అనే ప్రాంతంలో ఉంది. కానీ దాని పేరును అడ్డు పెట్టుకుని కొందరు ఫేక్ యాడ్స్ ఇచ్చి జనాలను అలా బురిడీ కొట్టిస్తున్నారు. అందులో భాగంగానే ఆమె ఆ మొత్తాన్ని కోల్పోయింది. కనుక అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్‌లలోని లింక్‌లను ఓపెన్ చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.