ఆన్‌లైన్ లో ఎక్కువగా డేటింగ్ వెబ్‌సైట్లు లేదా డేటింగ్ యాప్ లలో కాలక్షేపం చేస్తున్నారా ? అయితే అక్కడి వరకు బాగానే ఉంటుంది. కానీ శృతి మించితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. అవును.. కొందరు పురుషులకు సరిగ్గా ఇలాగే జరిగింది. డేటింగ్ యాప్‌లో పరిచయం అయిన మహిళతో సరదాగా గడపవచ్చని అనుకున్నారు. చివరకు వారే అడ్డంగా బుక్కయ్యారు. ఆ కి’లేడీ’ వారిని మోసగించి డబ్బులు కాజేసింది.
పూణెకు చెందిన ఓ మహిళ (27) బీసీఎ మధ్యలోనే మానేసింది. స్థానికంగా ఓ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలో పనిచేసేది. లాక్‌డౌన్ వల్ల ఆమె ఉద్యోగం కోల్పోయింది. అయితే డబ్బులు సులభంగా సంపాదించాలి, జల్సాలు చేయాలన్న ఆశతో ఆమె డేటింగ్ యాప్‌లలో మగాళ్లకు వల వేసేది. ఈ క్రమంలో సహజంగానే కొందరు ఆమె వలలో పడ్డారు. అలా మొత్తం 16 మంది ఆమె బారిన పడి మోసపోయారు.
డేటింగ్ పేరిట ఆమె వారిని రప్పించుకునేది. వారు నిజమే అని నమ్మి ఆమె వద్దకు వచ్చేవారు. అయితే వారికి డ్రింక్స్ ఆఫర్ చేసి వాటిలో ఆమె మత్తు మందు కలిపి ఇచ్చేది. దీంతో వారు స్పృహ తప్పి పడిపోయేవారు. తరువాత వారిని ఆమె నిలువు దోపిడీ చేసేది. ఇలా ఆమె అంతమందిని దోచుకుంది. అయితే మోసం ఎన్నటికీ దాగదు కదా. అక్కడి ఆశిష్ కుమార్ అనే వ్యక్తితోపాటు కొందరు బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ కి’లేడీ’ని అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.15.25 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆమె 16 మందిని మోసం చేసి వారి నుంచి విలువైన వస్తువులు, నగలు, నగదు దోపిడీ చేసిందని, టిండర్, బంబుల్ వంటి డేటింగ్ యాప్‌లలో ఆమె పురుషులను పరిచయం చేసుకునేదని పోలీసులు తెలిపారు. అయితే కేవలం కొందరు మాత్రమే ఫిర్యాదు ఇచ్చారని, కొందరు బాధితులు అసలు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.