రాహుల్‌ విమర్శలకు ప్రధాని స్ట్రాంగ్‌ కౌంటర్‌

-

ప్రధాని నరేంద్రమోదీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సభలో మాట్లాడిన రాహుల్‌.. ప్రధాని మోదీని దేశ యువత కర్రలతో కొడుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ లోక్‌సభలో కౌంటర్‌ ఇచ్చారు. రాహుల్‌గాంధీని ట్యూబ్‌లైట్‌తో పోలుస్తూ హేళనగా మాట్లాడారు.

అసలేం జరిగిందంటే బుధవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక సభలో ప్రసంగించిన రాహుల్‌గాంధీ.. ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఎన్నికల సందర్భంగా హామీల వర్షం కురిపించిన ప్రధాని మోదీ.. ఇప్పుడు ఆ సమస్యపై ఎందుకు పెదవి విప్పడంలేదని ప్రశ్నించారు. ప్రధానమైన నిరుద్యోగ సమస్యపై ప్రధాని ఇలాగే మౌనం వహిస్తే.. మరో ఆరేడు నెలల తర్వాత ఆయన ఇంటి నుంచి బయట అడుగుపెట్టే పరిస్థితి ఉండదన్నారు. ఆయన బయటికి వస్తే దేశంలోని నిరుద్యోగ యువత కర్రలతో కొడుతుందని హెచ్చరించారు.

అయితే రాహుల్‌ వ్యాఖ్యలకు అదేరీతిలో ప్రధాని మోదీ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్‌ వ్యాఖ్యలను ఆయన పేరు ప్రస్తావించకుండా గుర్తుచేశారు. ‘ఓ కాంగ్రెస్‌ ఎంపీ మరో ఆరు నెలల్లో ప్రధానిని కర్రలతో కొడుతాం అన్నాడట. గత 20 ఏండ్లుగా నేను ప్రత్యర్థి పార్టీల విమర్శలను తిప్పికొడుతూ ‘విమర్శల ప్రూఫ్‌’గా, ‘దెబ్బల ప్రూఫ్‌’గా కూడా తయారయ్యాను’. అయినా కర్ర దెబ్బలు తినడం గురించి తలుచుకుంటే చాలా కష్టమే అనిపిస్తుంది’ అని హేళనగా మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యులంతా బల్లలు చరుస్తూ బిగ్గరగా నవ్వారు. తర్వాత ప్రధాని ప్రసంగం కొనసాగిస్తూ.. ‘కష్టమైన పనే అయినా మరో ఆరు నెలల సమయం ఉంది కాబట్టి కర్ర దెబ్బలు తినేందుకు సిద్దపడొచ్చు’ అన్నారు. దీంతో సభలో మరోసారి నవ్వులు, బల్లల చప్పుళ్లు మారుమోగాయి.

వెంటనే రాహుల్‌గాంధీ లేచి నిలబడి సభలో అరుపులు, నవ్వుల కారణంగా మీరేం మాట్లాడుతున్నారో వినపడటం లేదని ప్రధానిని ఉద్దేశించి అన్నారు. ఈ సందర్భంగా కూడా రాహుల్‌పై ప్రధాని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ను కూర్చోమని సైగ చేస్తూనే.. ‘నేను గత 40 నిమిషాలుగా మాట్లాడుతున్నా. కానీ ఆయనకు నా మాటలు ఇప్పుడు చేరాయి. చాలామంది ట్యూబ్‌లైట్లు ఇలాగే ఉంటారు’ అని ఎగతాళి చేశారు. ఆ తర్వాత ఇతర అంశాలపై తన ప్రసంగం కొనసాగించారు ప్రధాని.

Read more RELATED
Recommended to you

Latest news