బోనమెత్తిన స్టార్ షట్లర్ పీవీ సింధు

బోనాల పండుగతో భాగ్యనగరం శివమెత్తిస్తోంది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, సంప్రదాయదుస్తుల్లో మహిళలతో నగరంలోని అమ్మవారి ఆలయాలు కళకళలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి వస్తోన్న భక్తులతో లాల్​దర్వాజ సింహవాహిని అమ్మవారి ప్రాంగణం కిటకిటలాడుతోంది.

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు లాల్​దర్వాజ అమ్మవారి బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. నెత్తిన బంగారు బోనం ఎత్తుకొచ్చి సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పించారు. ప్రతి ఏటా అమ్మవారికి బోనం సమర్పించే సింధు.. గత ఏడాది మాత్రం టోర్నమెంట్‌ కారణంగా రాలేకపోయారు. ఈసారి అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. సింధును ఆలయ కమిటీ సత్కరించింది.

“నాకు హైదరాబాద్ బోనాల పండుగ అంటే చాలా ఇష్టం. ప్రతి ఏటా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటాను. కానీ గతేడాది బోనాల సమయంలో పోటీల వల్ల రాలేకపోయాను. ఈసారి అమ్మకు బంగారు బోనం సమర్పించడం చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి తప్పకుండా ప్రతియేడు బోనాల ఉత్సవంలో పాల్గొంటాను. అని స్టార్ షట్లర్ పీవీ సింధు చెప్పారు.