సాధారణంగా మన దేశంలో ఉన్న హిందువులందరూ తమ తమ ఇష్టానుసారం ఆయా దేవుళ్లను పూజిస్తారు. కాని యమధర్మరాజుని మాత్రం ఎవరు పూజించరు. ఆ పేరు వింటేనే ఏదో కీడుగా భావిస్తారు. అయితే తమ ప్రాణాలను హరిస్తాడు అని తెలిసినా యమధర్మరాజుకి కూడా భక్తి తో పూజలు చేస్తారు అంటే నమ్మగలరా? అది కూడా మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది. అక్కడ యమధర్మరాజుకి విశేష పూజలు చేస్తారు అంటే ఆ గుడి గురించి తెలుసుకోవాలని ఎవరికైనా ఆసక్తి కలగక మానదు.
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో జగిత్యాలలో ఉన్న ఉగ్ర నరసింహ స్వామి దేవాలయంలో ఉపాలయం గా యమధర్మరాజు ఆలయం ఉంది. ఈ ఆలయం పదిహేను వందల సంవత్సరాల క్రితమే నిర్మించారు అని పురాణ గాద. తమ జాతకాలు బాగో లేదని, ఏం చేసినా ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటం లేదని, మనశాంతి లేదని, గ్రహ పీడలు తొలగించు కోవడానికి ఇక్కడకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ప్రతి నెల భరణి నక్షత్రం రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
దీపావళి కి రెండు రోజుల తరువాత వచ్చే యమ ద్వితీయ రోజున యముడు తన చెల్లెలు అయిన యమునా నది ఇంటికి భోజనానికి వెళ్లి తిరిగి వెళుతూ ఈ రోజు ఎవరైతే తమ తోబుట్టువుల చేతి వంట తింటారో వారికి నరక లోక భాధలు ఉండవు అని వరమిస్తాడు. ఆరోజున ఇక్కడ గోదావరిలో స్నానం చేసి యమునికి నమస్కరించి విశేష పూజలు చేస్తారు. కార్తిక మాసంలో ఇక్కడ రద్దీగా ఉంటుంది. ఏది ఏమైనా యముడు పేరు వింటేనే భయపడతాము. కాని యముని అనుగ్రహం కోసం పూజలు నిర్వహించడం మాత్రం విశేషంగా చెప్పుకోవచ్చు.