ప్రముఖ తెలుగు రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల ఆనందో బ్రహ్మ సినిమాగా రానుంది. ఈ మేరకు నవల సినిమా హక్కులను అమెరికాలో స్థిరపడ్డ ప్రముఖ తెలుగు దర్శక నిర్మాత ముక్తేశ్ రావు మేక సొంతం చేసుకున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మూడు హాలీవుడ్ సినిమాలు నిర్మిస్తున్న ఆయన ఆనందో బ్రహ్మ నవలను త్వరలో సినిమాగా తెరకెక్కించనున్నారు. ఈ క్రమంలో ముక్తేశ్ రావు నవల హక్కులను తాజాగా కొనుగోలు చేశారు. కాగా 1729 పిక్చర్స్ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు.
ఆనందోబ్రహ్మ నవలకు అప్పట్లోనే పాఠకుల నుంచి ఎంతో ఆదరణ లభించింది. దీనికి ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. యండమూరి అభిమానులే కాదు, అనేక మంది నవలా ప్రియులు ఈ నవలను ఇప్పటికీ చదువుతుంటారు. ఇక దీని కథ విషయానికి వస్తే.. ఓ పల్లెటూరి యువకుడు పట్నం వస్తే.. అతడిని ఓ గృహిణి సేద తీరుస్తుంది. వారిద్దరి మధ్య ఉన్నది ఏంటి ? ప్రేమా ? ఆకర్షణా ? అనుబంధమా ? సెక్సా ? అనే కథనంతో ఈ నవల సాగుతుంది. మనుషుల మధ్య సంధాలు, ఆత్మీయ అనుబంధాలను ఈ నవల మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. దీన్నే త్వరలో సినిమాగా తీయనున్నారు.
కాగా ఆనందోబ్రహ్మ నవలను సినిమాగా తీయాలని ముక్తేశ్ రావు గతంలోనే అనుకున్నారు. కానీ వీలు పడలేదు. ఇక ఈయన ఈ నవలను 12 ఏళ్ల వయస్సులోనే చదివారు. అప్పటి నుంచి ఈ నవలను ఆయన విడిచిపెట్టలేదు. ఎప్పటికైనా సినిమా తీద్దామని అనుకున్నారు. అందులో భాగంగానే 2020 ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చిన ముక్తేశ్ రావు ఎట్టకేలకు యండమూరితో మాట్లాడి ఆ నవలకు గాను సినిమా హక్కులను కొనుగోలు చేశారు. దీంతో ఈ నవల త్వరలోనే వెండి తెరపై ఆవిష్కృతం కానుంది.
ఈ సందర్భంగా ముక్తేశ్ రావు మాట్లాడుతూ.. ఆనందో బ్రహ్మను త్వరలోనే ఆధునిక టెక్నాలజీతో సినిమాగా తీస్తానన్నారు. ఈ నవలలో కథ గోదావరి తీరాన సాగినా.. స్టోరీ యూనివర్సల్ కనుక దీన్ని మిసిసిప్పీ నది తీరంలోనూ తీయవచ్చన్నారు. తన 35 ఏళ్ల కల నిజమవుతున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
యండమూరి మాట్లాడుతూ.. ఆనందో బ్రహ్మ తనకు నచ్చిన నవల అని, దాన్ని సినిమాగా తీయాలంటే చాలా ధైర్య సాహసాలు ఉండాలని, తన మిగితా నవలల రైట్స్ అమ్ముడు పోయినంత వేగంగా ఈ నవల రైట్స్ అమ్ముడు పోలేదని అన్నారు. ఈ పుస్తకాన్ని సినిమాగా తెరకెక్కించాలనుకున్నా.. రకరకాల కారణాల వల్ల తీయలేకపోయానన్నారు. అటువంటి సమయంలో ముక్తేశ్‌రావు ఈ నవల రైట్స్‌ను కొనడానికి ముందుకు వచ్చారని, అమెరికాలో స్థిరపడి, సినిమాలను నిర్మిస్తున్న ముక్తేశ్‌రావు ఈ నవల రైట్స్‌ను సొంతం చేసుకోవడం గొప్ప విషయమని అన్నారు. స్వీయ దర్శకత్వంలో ముక్తేశ్ రావు నిర్మించనున్న ఈ చిత్రం భవిష్యత్తు, గతం రెండూ మిళితమై ఉంటుందని, ఈ నవలను చిత్రంగా తెరకెక్కించాలంటే ధైర్య సాహసాలతో కూడిన పని అని అన్నారు. అందుకు ముక్తేశ్ రావుకు బెస్టాఫ్ లక్ చెబుతున్నానని తెలిపారు.