గుంటూరు జిల్లా తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవికి మరో సారి షాకిచ్చింది వైసీపీ పార్టీ. తాడికొండ అదనపు సమన్వయకర్తగా కత్తెర సురేష్ కుమార్ ను నియమించింది వైసీపీ అధిష్టానం. డొక్కాను అదనపు సమన్వయకర్తగా నియమించిన సమయంలో వైసీపీలో గ్రూపు రాజకీయాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, తాడికొండలో గ్రూపులకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది వైసిపి అధిష్టానం.
డొక్కా మాణిక్య వరప్రసాద్ స్థానంలో అదనపు సమన్వయకర్తను నియమించింది వైసీపీ అధిష్టానం. జిల్లా అధ్యక్షుడిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియామకం చేసింది. గతంలోనూ తాడికొండకు ఇన్చార్జిగా వ్యవహరించింది కత్తెర సురేష్ కుటుంబం. 2014లో వైసీపీ నుండి పోటీ చేసి ఓడిన సురేష్ భార్య కత్తెర క్రిస్టినా… ప్రస్తుతం గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. అయితే, అధిష్టానం తాజా ఆదేశాలతో తాడికొండ గ్రూపు రాజకీయాలు సమసిపోతాయంటున్నారు వైసీపీ కార్యకర్తలు. అటు జిల్లా అధ్యక్షుడిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియామకం చేయడంతో… తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవి శిబిరంలో అలజడి నెలకొంది. దీనిపై ఎమ్మెల్యే శ్రీదేవి ఎలా స్పందిస్తుందో చూడాలి.