రాష్ట్రంలో రాజధాని ఎక్కడుండాలో నిర్ణయించుకొనే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని వైసీపీ ఎంపీ విజయ్‌సాయిరెడ్డి అన్నారు. ఈ విషయంలో కేంద్రం, న్యాయవ్యవస్థలు చొరబడటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఆయన మంగళవారం రోజున రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘రెండు, మూడు రాజధానుల ప్రధాన ఉద్దేశం పాలనా వికేంద్రీకరణే. అధికారం ఒకేచోట కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాలూ మిగతావాటితో సమానంగా అభివృద్ధి చెందాలి. అయితే న్యాయవ్యవస్థ ఓవర్‌రీచ్ వల్ల దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభివృద్ధి వికేంద్రీకరణ ఫలాలు దక్కకుండా పోయాయి. రాజధాని విషయం ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఆర్టికల్ 154 రెడ్ విత్ 163 ప్రకారం రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. రాజధానిని నిర్ణయించే అంశం పూర్తిగా కార్యనిర్వాహక పరిధిలోనిది కాబట్టి ఇది రాష్ట్ర పరిధిలోని అంశమే. రాజధానిగా ఏ నగరం ఉండాలన్నది రాష్ట్రప్రభుత్వం నిర్ణయించొచ్చు.’ అని విజయ్ సాయి రెడ్డి పేర్కొన్నారు.