ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో మద్యం కోసం వేలాది మంది మద్యం షాపుల వద్ద బారులు తీరారు. సామాజిక దూరం కూడా పాటించే పరిస్థితి కనపడటం లేదు. 5 మంది మాత్రమే లైన్ లో ఉండాలని ప్రభుత్వ చెప్పినా ఆదేశాలు ఇచ్చినా సరే జనాలు మాత్రం మారడం లేదు. అర్ధం చేసుకోకుండా భారీగా బారులు తీరి మద్యం కొనుగోలు చేస్తున్నారు.
దీనితో ఏపీ సర్కార్ పై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి చర్యలు గ్రీన్ జోన్ ని ఆరెంజ్ జోన్ గా ఆరెంజ్ జోన్ ని రెడ్ జోన్ గా మారుస్తాయి అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు జిల్లాలు మినహా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇప్పుడు మద్యం అమ్మకాలు చేపట్టింది ప్రభుత్వ౦. ఇలా వేలాది మంది ఒక్క చోటే బారులు తీరడం తో కరోనా ఎక్కడ విస్తరించే అవకాశం ఉంటుందో అనే భయం జనాల్లో మొదలయింది.
ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు మద్యం షాపుల వద్ద బారులు తీరుతుంది టీడీపీ కార్యకర్తలు అనే ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో దీనిపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి గానూ ఇలాంటి చర్యలు చంద్రబాబు చేస్తున్నారని పలువురు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం గమనార్హం.
దీనిపై తెలుగుదేశం పార్టీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తుంది. సిఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇలాంటివి చేసారు కాబట్టి ఆయన ఈ విధంగా ఆలోచనలు చేస్తూ టీడీపీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు వచ్చేది వైసీపీ నేతలకే అని విమర్శలు చేస్తున్నారు. ఇక మద్యం అమ్మకాలకు వ్యతిరేఖంగా మహిళలు పలు జిల్లాల్లో ధర్నాలు చేస్తున్నారు.