ఉదయం నిద్ర లేవగానే చాలా మంది కాలకృత్యాలు తీర్చుకుని వెంటనే బ్రష్ చేసుకుంటారు. టూత్ పౌడర్ లేదా పేస్ట్ లేదా వేప పుల్లలతో దంతాలను తోముకుంటారు. అయితే కొందరు మాత్రం నిద్ర లేవగానే బెడ్ టీ లేదా కాఫీ తాగుతారు. వెంటనే బ్రష్ చేయకుండా బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల తీవ్రమైన వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నోటి దుర్వాసన సమస్య.. దీన్నే హలిటోసిస్ అంటారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. నోటి శుభ్రత లేకపోవడం వల్ల ఇది వస్తుంది. రోజంతా మనం తినే ఆహారాలు నోట్లో ఎంతో కొంత భాగం ఉంటాయి. అవి ఎక్కువ సమయం గడిచే కొద్దీ కుళ్లిపోతాయి. దీంతో నోట్లో బాక్టీరియా తయారవుతుంది. ఫలితంగా నోటి దుర్వాసన వస్తుంది.
అయితే దంతాలను తోముకోకపోతే నోట్లో బాక్టీరియా పెరిగిపోతుంది. దీంతో సమస్య ఇంకా తీవ్రతరం అవుతుంది. నోట్లో బాక్టీరియాను అలాగే పెట్టుకుని ఉదయం బెడ్ టీ, కాఫీ లను తాగడం మంచిది కాదు. కొందరు ఆహారం కూడా తింటారు. అది ఇంకా చేటు చేస్తుంది. అందువల్ల ఉదయం కచ్చితంగా దంతాలను తోముకోవాలి. తరువాతే ఆహారాలను లేదా టీ, కాఫీ వంటివి తీసుకోవాలి.
నోటి శుభ్రత లేకపోతే దంతాలు క్షీణిస్తాయి. పుచ్చిపోతాయి. దీంతో దంతాలను తీసేయాల్సి వస్తుంది. చిగుళ్ల సమస్యలు వస్తాయి. దంతాలు బలహీనంగా మారుతాయి. కనుక దంతాలను రోజూ తోముకోవాలి. ఉదయం, రాత్రి భోజనం తరువాత దంతాలను తోముకుంటే ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.